దక్షిణ కొరియా: ప్రెప్పర్లు ఎవరు, ఉత్తర కొరియాతో యుద్ధం వస్తుందని వీళ్లు ఏం చేస్తున్నారు?

ఉత్తర కొరియాతో ఒకవేళ యుద్ధం వస్తే ఎలా? అనే ముందుచూపుతో కిమ్ జాంగ్ హో తన ఇంట్లో ఒక సర్వైవల్ కిట్‌ను సిద్ధం చేసుకున్నారు.

ఊహించనిది ఏదైనా జరిగితే మొదటి 72 గంటలు ఈ కిట్ తాను బతికి ఉండేందుకు సహాయపడుతుందని 30 ఏళ్ల కిమ్ జాంగ్ హో భావిస్తున్నారు.

ప్రాథమిక అవసరాలైన నీరు, ఆహారంతో పాటు ఒక మ్యాప్, దిక్సూచిని కూడా ఆయన తన కిట్‌లో పెట్టుకున్నారు.

ఒకవేళ మొబైల్ ఫోన్ నెట్‌వర్క్‌లు, ప్రజారవాణా వంటి మౌలిక సదుపాయాలు దెబ్బతింటే మ్యాప్, దిక్సూచి తనకు ఉపయోగకరంగా ఉంటాయనేది ఆయన ఆలోచన.

మరింత ముందుచూపుతో ఆలోచిస్తూ శరీర కవచం, ఒక గ్యాస్ మాస్క్‌ను కూడా ఈ కిట్‌లో చేర్చారు. మిలిటరీ వద్ద సరిపడినన్ని రక్షణ కవచాలు ఉండే అవకాశం లేకపోవచ్చనే ఉద్దేశంతో, ఒక రిజర్విస్ట్‌గా తన కోసం ముందుగానే ఈ రక్షణ కవచాన్ని సిద్ధం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. మిలిటరీ రిజర్వ్ ఫోర్స్ సభ్యులను రిజర్విస్ట్ అని పిలుస్తారు.

‘‘నేను సోల్‌లో ఉంటాను. ఒక్క క్షిపణి దాడితో అంతా మాయమైతుందనే ఆలోచన నన్ను భయపెడుతుంది’’ అని కిమ్ జాంగ్ హో చెప్పారు.

1953లో ఏర్పాటైన డీమిలిటరైజ్డ్ జోన్‌ ( నిస్సైనిక ప్రాంతం)కు ఉత్తరాన 30 మైళ్ల దూరంలో దక్షిణ కొరియా రాజధాని సోల్ ఉంటుంది. 1953లో కొరియన్ యుద్ధానికి సంబంధించిన యుద్ధ విరమణ ఒప్పందం జరిగింది.

కానీ, కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. అణ్వాయుధాలు ఉన్న ఉత్తర కొరియా ఈ ఏడాదిలో ఇప్పటివరకు తొమ్మిది ఆయుధ పరీక్షలను నిర్వహించింది. గ్వామ్‌ను చేరుకోగల ఒక హైపర్‌సోనిక్ ఇంటర్మీడియట్ రేంజ్ మిసైల్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు ఏప్రిల్‌లో ఉత్తర కొరియా పేర్కొంది.

ఉత్తర కొరియాతో యుద్ధం రావొచ్చనే అంచనాలతో అందుకు సిద్ధమవుతోన్న దక్షిణ కొరియా యువత సంఖ్య పెరుగుతోంది. వారిలో కిమ్ కూడా ఒకరు.

దక్షిణ కొరియాలోని ప్రముఖ మెసేజింగ్ యాప్ కకావో. ఈ యాప్ లోని కనీసం నాలుగు ప్రెప్పర్ గ్రూప్‌ (ఎమర్జెన్సీ పరిస్థితులకు సన్నద్ధమయ్యేవి)లలో 900 మంది చేరారు.

2010 నుంచి నడుస్తున్న ఉన్న ‘ద సర్వైవల్ స్కూల్ డూమ్ కేఫ్’ అనే ఒక ప్రెప్పర్ కమ్యూనిటీలో సభ్యుల సంఖ్య 25వేలకు పైగా ఉంటుంది. దక్షిణ కొరియాలోని మూడో అతిపెద్ద ఈ-కామర్స్ వేదిక అయిన జీమార్కెట్ ప్రకారం, ఒక ఏడాదిలో సర్వైవల్ బ్యాగ్స్, విపత్తు నిర్వహణ కిట్ల అమ్మకాలు దాదాపు మూడురెట్లు పెరిగాయి.

ఉత్తర కొరియా దూకుడుగా వ్యవహరిస్తున్నందున, కొరియన్ల మధ్య సంబంధాల్లో పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా ఈ ప్రెప్పర్ల సంఖ్య పెరుగుతున్నట్లు సూచిస్తోంది.

దక్షిణ కొరియా తమకు ప్రథమ శత్రువని, రెండు దేశాల మధ్య శాంతి అసాధ్యమని జనవరిలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అన్నారు.

ఈ చర్య ఊహించనిది అని కొరియా యూనివర్సిటీలో పొలిటికల్ ఎకానమీ బోధించే నామ్ సుంగ్ వూక్ అన్నారు. అంటే దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా అణ్వాయుధాలను వాడొచ్చని దీనర్థం అని నామ్ సుంగ్ అభిప్రాయపడ్డారు.

కేబీఎస్ పబ్లిక్ మీడియా రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చేసిన ఒక సర్వేలో పాల్గొన్న వారిలో 75 శాతానికి పైగా దేశంలోని భద్రతా పరిస్థితుల గురించి ఆందోళనగా ఉన్నట్లు చెప్పారు.

రష్యా-యుక్రెయిన్, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధాల వంటి ప్రపంచ సంఘర్షణల నేపథ్యంలో కొరియాలోని యువత తమకు పొంచి ఉన్న భౌగోళిక-రాజకీయ ప్రమాదాలను ఎక్కువగా ఊహిస్తున్నారని ‘ద సర్వైవల్ స్కూల్ డూమ్ కేఫ్’ అడ్మిన్ వూ సియోంగ్ యెప్ అన్నారు.

పైన ప్రస్తావించిన ప్రెప్పర్ గ్రూప్‌లలో ఒకటి యుక్రెయిన్ యుద్ధం మొదలవ్వగానే పుట్టుకొచ్చింది. ఈ రెండేళ్లలో ఆ గ్రూపులోని సభ్యుల సంఖ్య 10 రెట్లు పెరిగి 500కు చేరింది.

‘‘నా జీవితంలో ఒక యుద్ధానికి సిద్ధమవుతానని నేనెప్పుడూ అనుకోలేదు. కానీ, ఇప్పుడు ఒకసారి ప్రపంచాన్ని చూడండి. చాలా యుద్ధాలు జరుగుతున్నాయి’’ అని ఫిట్‌నెస్ ట్రైనర్ పార్క్ వీ బిన్ అన్నారు. ఆయన గతేడాది సీపీఆర్ ట్రైనింగ్‌ కోర్స్‌ను కూడా పూర్తి చేశారు.

ఉత్తర కొరియాతో ఏదైనా ఘర్షణ రాకముందే దేశాన్ని విడిచివెళ్లిపోవాలని కొందరు సభ్యులు కోరుకుంటున్నారు. నివాసానికి సురక్షితమని భావించే దేశాలకు చెందిన భాషను నేర్చుకోవడం, డబ్బును పొదుపు చేయడం, కావాల్సిన నైపుణ్యాలను సంపాదించడం వంటివి వారు చేస్తున్నారు.

‘‘పరాగ్వేలో దాదాపు 10 మిలియన్ వోన్‌ (7200 డాలర్లు)లు పెడితే పర్మినెంట్ రెసిడెన్సీ (శాశ్వతంగా అక్కడే ఉండేందుకు ఇచ్చే వీసా) సంపాదించొచ్చని విన్నాను’’ అని ఒక సభ్యుడు రాసుకొచ్చారు.

హసాంగ్‌ నగరంలోని తన రెండస్థుల భవనం కింద ఒక బంకర్‌ను నిర్మిస్తున్నట్లు పేరు చెప్పడానికి ఇష్టపడని మరో ప్రెప్పర్ చెప్పారు. మందపాటి కాంక్రీటు గోడలతో ఏర్పాటు చేసిన ఆ బంకర్‌లో పవర్ జనరేటర్లు, వంట సామగ్రి ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. తన భార్య, ఆరేళ్ల కుమారుడి భద్రత కోసం దీన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

చాలామంది కొరియన్లు ప్రెప్పర్లను సున్నితమైన మనుషులుగా చూస్తారు. కిమ్ తల్లి కూడా సర్వైవల్ కిట్స్ కోసం అనవసరంగా డబ్బు ఖర్చు చేశావంటూ కిమ్‌ను తిట్టారు.

‘‘ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య గొప్ప సంబంధాలు లేనప్పటికీ నేనెప్పుడూ యుద్ధం గురించి ఆందోళన చెందలేదు. సాధారణ జీవితాన్ని గడుపుతున్నా’’ అని బీబీసీతో 28 ఏళ్ల లీ యాంగ్ చెప్పారు.

సాంకేతికంగా చూస్తే ఇరు దేశాల మధ్య యుద్ధపరిస్థితులు ఉన్నప్పటికీ దక్షిణ కొరియా సంపన్నమైన, శక్తిమంతమైన ప్రజాస్వామ్య దేశంగా ఎదిగింది.

దశాబ్దాల శాంతి కారణంగా చాలామంది దక్షిణ కొరియన్లు యుద్ధం అంటే ఉదాసీనంగా మారారని వూ అభిప్రాయపడ్డారు.

భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రజల ఆలోచనా తీరు మారుతోందని ప్రెప్పర్లను ఉద్దేశించి ఆయన అన్నారు.

‘‘విమానం ఎక్కినప్పుడు వారు సేఫ్టీ సామగ్రిని అందిస్తారు కదా. అలాగే సేఫ్టీ గేర్ కొనడం కూడా సీట్ బెల్ట్ పెట్టుకోవడం లాంటిదే’’ అని కిమ్ సమర్థించుకున్నారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-27T11:04:08Z dg43tfdfdgfd