భువనగిరి బీజేపీలో గ్రూపు రాజకీయాలు

భువనగిరి బీజేపీలో గ్రూపు రాజకీయాలు

  • సీనియర్లలో టికెట్​ దక్కలేదన్న అసంతృప్తి
  • ప్రచారానికి దూరం
  • అభ్యర్థి ‘బూర’  కలుపుకుని పోవట్లేదన్న ఆరోపణలు 
  • డీలా పడుతున్న కేడర్​ 

యాదాద్రి, వెలుగు : జాతీయ స్థాయిలో మోదీ ప్రభావం, రామ మందిర అంశంతో బీజేపీ ఊపుమీద ఉండగా భువనగిరిలో మాత్రం డీలా పడుతోంది. తెలంగాణలో గెలిచే సీట్ల లో భువనగిరి కూడా ఒకటని బీజేపీ భావించగా, గ్రూపు రాజకీయాలు ఆ పార్టీ కొంప ముంచేలా ఉన్నాయి. ఎన్నికల టైంలో లీడర్లంతా ఎవరికి వారే అన్నట్టుగా సాగుతున్నారు. ప్రచారంలో కూడా పాల్గొనడం లేదు. దీంతో పార్టీ కేడర్ డీలా పడిపోతోంది. 

సీనియర్ల అలక..ప్రచారానికి దూరం 

భువనగిరి లోక్​సభ సీటును సీనియర్ లీడర్లు గంగిడి మనోహర్​రెడ్డి, యాదాద్రి జిల్లా మాజీ అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు సహా మరికొందరు ఆశించారు. అయితే, మునుగోడు ఉప ఎన్నికల సమయంలో బీఆర్ఎస్​కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్​కు టికెట్​లభించింది. అప్పటి నుంచి టికెట్​ఆశించిన వారితో పాటు మరికొందరు సీనియర్లు అసంతృప్తితో ఉన్నారు. దీంతో శ్యాంసుందర్​రావు ప్రచారం వైపు కన్నెత్తి చూడలేదు. మరో లీడర్​ గంగిడి మనోహర్ ​రెడ్డి ఒకటి రెండు సార్లు వచ్చినా నామ్​కే వాస్తే అన్నట్టుగానే వ్యవహరించారు. 

.ఇప్పుడాయన ఇక్కడి ఎన్నికలను పక్కన పెట్టి కరీంనగర్​ ప్రచారంలో మునిగిపోయారు. మరో కీలక నేత సంకినేని వెంకటేశ్వర్​రావు, గూడూరు నారాయణరెడ్డి కూడా క్యాంపెయిన్​లో పాల్గొనడం లేదు. బూర నర్సయ్య గౌడ్​ నామినేషన్​సందర్భంగా ఈ నెల 23న నిర్వహించిన ర్యాలీకి సరిగ్గా జన సమీకరణ చేయలేదన్న అసంతృప్తి కూడా పార్టీలో నెలకొంది. విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్​వచ్చిన ర్యాలీకి మరీ తక్కువగా జనం రావడంపై పెదవి విరుస్తున్నారు. మరోవైపు బూర నర్సయ్య అసంతృప్త సీనియర్లతో సత్సంబంధాలు నెరిపే ప్రయత్నం చేయలేదన్న ఆరోపణలున్నాయి. సమావేశాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో సీనియర్ల ఫొటోలను విస్మరించడంపై కూడా చర్చ నడుస్తోంది. 

 

క్యాస్ట్​ప్రభావం 

బూర నర్సయ్య గౌడ్​ను అభ్యర్థిగా ఎంపిక చేసిన తర్వాత పార్టీలో క్యాస్ట్​ ప్రభావం ఎక్కువైందంటున్నారు. ఆయన చుట్టూ ఒకటే కులానికి చెందిన వారుంటున్నారని చెబుతున్నారు. దీంతో పార్టీలోని ఇతర కులాలకు చెందిన క్యాడర్​ అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. కులానికి ప్రాధాన్యత ఇవ్వడం వల్ల ఇతర కులాల వారు దూరమవుతారని, ఎన్నికలపై ఇది ప్రభావం పడి దెబ్బతింటామని వాపోతున్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-04-26T05:51:11Z dg43tfdfdgfd