వామ్మో కుక్కలు : ప్రతి రోజూ 70 కుక్క దాడులు.. నెలలో ఇద్దరు మృతి

వామ్మో కుక్కలు : ప్రతి రోజూ 70 కుక్క దాడులు.. నెలలో ఇద్దరు మృతి

హైదరాబాద్ నగర వాసులను వీధి కుక్కలు బెంబేలెత్తిస్తున్నాయి. కుక్క కాటు కేసులు ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు.ఈ ఏడాది ఇప్పటి వరకు ప్రతి రోజూ 70 మంది కుక్క కాటుకు గురయ్యారు. ప్రతి నెలా కనీసం ఇద్దరు వ్యక్తులు రేబిస్ బారిన పడి మృతి చెందుతున్నారు. 2022లో 19 వేల 847 కేసులు నమోదవ్వగా, 2023లో 26 వేల 349 కేసులకు పెరిగింది. ఈ ఏడాది అంటే 2024 ఇంకా సగం కూడా పూర్తి కాకుండానే 9 వేల 208 కేసులు నమోదయ్యాయి.

 ఈ సీజన్ లో నగరంలో ఎనిమిది మంది రేబిస్‌ కారణంగా మరణించారని ప్రభుత్వ ఫీవర్‌ ఆసుపత్రి గణాంకాలు చెబుతున్నాయి. ఈ రేటు ప్రకారం, ఈ సంవత్సరం కేసులు గత సంవత్సరం గణాంకాలతో సులభంగా దాటుతాయి. గత ఐదేళ్లలో, అంటే జనవరి 1, 2019 నుండి ఏప్రిల్ 17, 2024 వరకు హైదరాబాద్‌లో మొత్తం 54 మంది రేబిస్‌తో మరణించారు. హైదరాబాద్‌లో కుక్కకాటు పెరగడంతో ప్రతి నెలా 3 వేల యాంటీ రేబిస్ టీకాలు ప్రతి నెలా 3 వేల నుండి 4 వేల రేబిస్ టీకాలు వేయబడుతున్నాయి. 

చికిత్స నిర్లక్ష్యం మంచిది కాదు : డాక్టర్ కే. శంకర్

ఫీవర్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కే శంకర్ మాట్లాడుతూ కుక్కకాటు తీవ్రత, యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ ప్రాముఖ్యతపై అవగాహన కొరవడిందన్నారు. కొందరు పెంపుడు కుక్కలు కరిచినప్పుడు చికిత్సను నిర్లక్ష్యం చేస్తారని ఇది చివరికి తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుందని తెలిపారు. వేసవిలో కుక్కలు దాహం, ఆకలి కారణంగా మరింత దూకుడుగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలందరూ, ముఖ్యంగా పిల్లలు, జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

నగర వీధుల్లో దాదాపు 4 లక్షల వీధికుక్కల్లో దాదాపు 90 వేల స్టెరిలైజేషన్ చేయబడలేదని స్టెరిలైజ్ చేయబడిన కుక్కలు కూడా దాహం, ఆకలిని అనుభవించినప్పుడు దూకుడుగా మారుతాయని వెటర్నరీ అధికారులు తెలిపారు.

4 వేల 800 నీటి గిన్నెలు ఉంచాం : జీహెచ్ఎంసీ

జీహెఎంసీ అధికారులు స్పందిస్తూ వీధికుక్కలకు ఉపశమనం కలిగించడానికి స్వచ్ఛంద సంస్థలతో కలిసి హైదరాబాద్ వ్యాప్తంగా సుమారు 4 వేల800  నీటి గిన్నెలను ఉంచామని చెప్పారు. అలాగే, స్టెరిలైజ్ చేయని కుక్కలను పట్టుకునేందుకు మూడు షిఫ్టుల్లో 50 డాగ్ క్యాచింగ్ టీమ్‌లను నియమించామని తెలిపారు. వాస్తవానికి, ఈ ప్రయత్నాల ఫలితంగా నగరంలో కుక్కల సంఖ్య 2007లో 7.5 లక్షల నుండి 2024 నాటికి 3.97 లక్షలకు తగ్గిందని అధికారులు వెల్లడించారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T08:28:58Z dg43tfdfdgfd