ఏపీలో కాంగ్రెస్ గెలిచే సీటు అదే..! ఆంధ్రాలో హస్తం పార్టీకి పునర్జీవం పోయనున్న ఆ అభ్యర్థి ఎవరంటే..?

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు వ్యూహాలను సిద్దం చేసుకుంటున్నాయి. ఓ వైపు వైఎస్సార్‌సీపీ, మరోవైపు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల కూటమి ఉంది.. వీరి మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందనే టాక్ ఉంది. వైఎస్సార్‌సీపీ, కూటమితో పాటుగా వైఎస్ షర్మిల నేతృత్వంలో కాంగ్రెస్ కూడా ఎన్నికల బరిలో ఉంది.. ఇప్పటికే అభ్యర్థుల్ని ప్రకటించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇటు కాంగ్రెస్ వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చిన పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చింది. గెలుపు, ఓటముల సంగతి పక్కన పెడితే.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని భావిస్తోంది.

మరి ఏపీ ఎన్నికల బరిలోకి దిగిన కాంగ్రెస్‌ ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌కు ఉన్న బలాన్ని బట్టి చూస్తే.. ఒక్క సీటు అయినా సాధిస్తుందా అంటూ కొందరు సోషల్ మీడియాలో ఎద్దేవా చేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇటీవల మారిన పరిణామాలతో కాంగ్రెస్ ఖాతాలోకి ఒక సీటు మాత్రం పక్కాగా చేరుతుందనే వాదన వినిపిస్తోంది. స్థానికంగా అభ్యర్థి బలంతో పాటుగా కాంగ్రెస్ పార్టీ పాత నాయకుల కలయికతో గెలుపు ఖాయమనే ధీమాతో ఉన్నారు. ఇంతకీ కాంగ్రెస్ అంత కాన్ఫిడెంట్‌గా ఉన్న సీటు ఏది అనుకుంటున్నారా.. బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గం.

మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరడంతో.. చీరాలలో గెలుపు ఖాయమని అందరూ ధీమాతో ఉన్నారు. నియోజకవర్గంలో త్రిముఖ పోరు ఉంటుందని.. ఈసారి ఆమంచి కచ్చితంగా గెలుస్తారని.. ఏపీలో కాంగ్రెస్ గెలిచే తొలి సీటు చీరాలే అంటున్నారు. చీరాలలో ఆమంచికి మంచి పట్టు ఉందని.. 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయనపై సానుభూతి కూడా ఉందని చెబుతున్నారు. అలాగే పాత తరం కాంగ్రెస్ నేతలు కూడా మళ్లీ యాక్టివ్ అయ్యారని.. ఆమంచి గెలుపు పక్కా అంటున్నారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కరణం వెంకటేష్‌‌, టీడీపీ అభ్యర్థి మాలకొండయ్య కూడా చీరాలకు కొత్తవారని ఆమంచి వర్గీయులు చెబుతున్నారు. ఈ అంశాలన్నీ తమకు కలిసొస్తాయని ఆమంచి వర్గం చెబుతోంది.

ఆమంచి పర్చూరు నియోజకవర్గానికి వెళ్లడంతో.. చీరాలలో ఉన్న అనుచరులు, కేడర్ ఎమ్మెల్యే కరణం వర్గానికి దూరంగా సైలెంట్ అయ్యిందనే వాదన ఉంది. వారంతా వైఎస్సార్‌సీపీలో అంత యాక్టివ్‌గా లేరంటున్నారు. అందుకే ఆమంచి కాంగ్రెస్‌లో చేరే ముందు.. చీరాల నియోజకవర్గంలో అనుచరులు, గతంలో తనతో కలిసి పనిచేసినవారితో ముందుగానే మాట్లాడి ఓ అంచనాకు వచ్చిన తర్వాతే కాంగ్రెస్ పార్టీలో చేరారని చెబుతున్నారు. ఆమంచికి పార్టీలతో సంబంధం లేదని.. ఆయన బలం మళ్లీ పెరిగిందని.. ఈసారి గెలవడం ఖాయమంటున్నారు. 2014 ఎన్నికల్లో కూడా ఆమంచి ఇండిపెండెంట్‌గా పోటీచేసి గెలిచిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.

చీరాల నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక్కడి నుంచి హేమా హేమీలు ప్రాతినిధ్యం వహించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిజేటి రోశయ్య చీరాల నుంచి గెలిచారు. అలాగే టీడీపీ నుంచి గెలిచిన పాలేటి రామారావు మంత్రిగా కూడా పనిచేశారు. రోశయ్య తర్వాత ఆయన శిష్యుడు ఆమంచి కృష్ణమోహన్ చీరాల నుంచి హవాను కొనసాగించారు. 2004లో కొణిజేటి రోశయ్య ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయ్యారు. 2009లో రోశయ్య తన శిష్యుడు ఆమంచి కృష్ణమోహన్‌కు కాంగ్రెస్ టికెట్ దక్కేలా చేశారు. ఆమంచి 2009 ఎన్నికల్లో చీరాల నుంచి తొలిసారి విజయం సాధించారు.

రాష్ట్ర విభజన తర్వాత చీరాలలో రాజకీయ పరిణామాలు మారిపోయాయి. ఆమంచి 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేయాల్సి వచ్చింది.. అయినా సరే ఆయన ఘన విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి రావడంతో.. వెంటనే పార్టీ మారారు. 2019 ఎన్నికల సమయంలో మళ్లీ చీరాలలో పరిస్థితి మారింది. ఆమంచి టీడీపీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరి చీరాల నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. అయితే బలరాం వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలపడంతో ఆమంచి రాజకీయ భవిష్యత్ గందరగోళంలోకి వెళ్లింది.

చీరాలలో ఆమంచి వర్సెస్ కరణం అన్నట్లుగా రాజకీయాలు హీటెక్కాయి. దీంతో వైఎస్సార్‌సీపీ అధిష్టానం ఆమంచిని చీరాలకు పొరుగునే ఉండే పర్చూరుకుకు పంపి.. ఆ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. పర్చూరు ఇంఛార్జ్‌గా కొనసాగిన కృష్ణమోహన్‌.. తనకు చీరాల టికెట్ కావాలని వైఎస్సార్‌సీపీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. కానీ వైఎస్సార్‌సీపీ సిట్టింగ్ ఎంపీ కరణం బలరాం కుమారుడు కరణం వెంకటేష్‌కు టికెట్ కేటాయించింది. దీంతో ఆమంచి రాజకీయ భవితవ్యం ఏంటనే చర్చ జరిగింది. ఆమంచి వెంటనే చీరాల నియోజకవర్గంలోకి అడుగుపెట్టి అనుచరులతో వరుసగా సమావేశాలు నిర్వహించారు.

ఆమంచి కృష్ణమోహన్‌ అనచరులతో చర్చల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ వెంటనే వైఎస్ షర్మిలను కలవగా.. వెంటనే టికెట్ కేటాయించారు. ఆమంచి నామినేషన్‌కు ఏకంగా షర్మిల హాజరయ్యారు.. బీఫారంను కూడా అందజేశారు. దీంతో చీరాల కాంగ్రెస్‌లో కొత్త జోష్ వచ్చిందంటున్నారు.. చీరాలలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమంటున్నారు. మరి చీరాలలో జరిగే త్రిముఖ పోరులో విజయం ఎవరిని వరిస్తుందన్నది చూడాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T08:44:30Z dg43tfdfdgfd