KCR BUS YATRA: కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభం... మిర్యాలగూడలో రోడ్డు షో..!

తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బస్సు యాత్ర ప్రారంభించారు.   సార్వత్రిక ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడుతుండటంతో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారాన్ని హోరెత్తించనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్ర, రోడ్ షోలు చేపట్టాలని డిసైడ్ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ భవన్ లో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించి రాష్ట్ర వ్యాప్తంగా బస్ యాత్రకు శ్రీకారం చుట్టారు. బస్ యాత్ర కు బయల్దేరిన కేసీఆర్ కు మహిళలు మంగళ హారతులు పట్టారు.  ఈ సందర్భంగా గులాబీ బాస్‌కు ఘన స్వాగతం పలికిన బిఆర్ఎస్ నేతలు,శ్రేణులు, కార్యకర్తలు. తెలంగాణ భవన్ నుండి మిర్యాల గూడకు బస్సు యాత్రతో  బయలు దేరారు కేసీఆర్.

రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లోనూ కేసీఆర్ ప్రచారం ఉండేలా బస్సు యాత్ర రూట్ మ్యాప్ రూపొందించారు.  నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని మిర్యాలగూడలో బస్సు యాత్ర ఇవాళ కొనసాగనుంది.  ప్రతి నియోజకవర్గంలోనూ స్థానిక నాయకులు, కార్యకర్తలతో కేసీఆర్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. సాయంత్రం వేళల్లో కనీసం రెండు మూడు ప్రాంతాల్లో రోడ్ షోల్లో కేసీఆర్ పాల్గొంటారు. ప్రజలనుద్దేశించి కార్నర్ మీటింగ్‌లలో ప్రసంగించనున్నారు. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఇళ్లలోనే కేసీఆర్‌తో పాటు పార్టీ నేతలు బస చేస్తారు.

కేసీఆర్‌ ప్రయాణించే బస్సుకు ‘తెలంగాణ ప్రగతి రథం’అని నామకరణం చేశారు. తొలిరోజు మిర్యాలగూడ, సూర్యాపేట రోడ్‌షోలలో పాల్గొంటారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చేరుకొని, అక్కడ రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం సూర్యాపేటకు వెళ్లి, అక్కడ కూడా రోడ్‌షో నిర్వహిస్తారు. రాత్రికి అక్కడే బస చేస్తారు. గురువారం భువనగిరికి చేరుకొని, సాయంత్రం రోడ్‌షో నిర్వహిస్తారు. అనంతరం ఎర్రవెల్లికి వెళ్లి అక్కడే బస చేస్తారు.

అయితే బస్సు యాత్రలో భాగంగా ఎండిన పొలాలను, ఎండిన చెరువులు, ప్రాజెక్టులను పరిశీలించనున్నట్టు తెలిసింది. ఈ క్రమంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఏదో ఒక బ్యారేజీని కూడా కేసీఆర్ పరిశీలించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, దీనిపై బస్సు యాత్ర షెడ్యూల్‌లో ఎలాంటి ప్రస్తావన లేదంటున్నారు.

2024-04-24T09:28:13Z dg43tfdfdgfd