ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన నిర్ణయం.. తెలుగు రాష్ట్రాల్లోనే తొలిసారిగా..!

Lok Sabha Elections 2024: తెలంగాణలో లోక్ సభ ఎన్నికల సమరం జోరందుకుంది. అన్ని పార్టీలు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. ఆయా పార్టీల అభ్యర్థులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ.. ఎండను కూడా లెక్కచేయకుండా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే.. తమ ప్రత్యర్థులపై వారి పార్టీలపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. కాగా.. ప్రత్యర్థుల ఆరోపణలు తిప్పికొట్టేందుకు అభ్యర్థులు తమదైన శైలిలో ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.. తెలంగాణకు కేంద్రంలో ఉన్న బీజేపీ ఏమీ చేయలేదంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేస్తుండగా.. అందరి నోళ్లు మూయించేదుకు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు.

మెదక్ నియోజకవర్గానికి కేంద్రం ఎన్ని నిధులు విడుదల చేశారన్నది లెక్కలతో సహా చెప్పేందుకు ఓ పుస్తకాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. మెదక్ పార్లమెంట్‌కు కేంద్రం ఇచ్చిన నిధులపై పుస్తకాన్ని హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో రఘునందన్ రావు విడుదల చేశారు. కేంద్ర నిధులపై సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారికి పోస్టులో ఈ పుస్తకం పంపనున్నట్లు తెలిపారు. రెండు పడక ఇళ్లు, రోడ్లు, ఉపాధి, నిధులకు సంబంధించిన వివరాలు పుస్తకంలో ఉన్నట్లు రఘునందన్ తెలిపారు.

పల్లె ప్రకృతి వనాలకు రూ.4.23 లక్షల చొప్పున అందజేశామని.. రైతు వేదికల నిర్మాణం కోసం రూ.10 లక్షల చొప్పున నిధులు అందజేశామని రఘునందన్ పేర్కొన్నారు. వైకుంఠధామాలకు రూ.11.13 లక్షల చొప్పున ఇచ్చామన్నారు. దుబ్బాక స్థానంలోనే ఉపాధి కూలీలకు రూ.230 కోట్లు నిధులు ఇచ్చినట్టు పేర్కొన్నారు. డంపు యార్డులకు రూ.2.5 లక్షల చొప్పున అందజేశామన్నారు. కొడంగల్‌లో ప్రతి పంచాయతీ వివరాలు కూడా పంపుతామని రఘునందన్ తెలిపారు.

ఈ క్రమంలోనే.. నరేంద్ర మోదీపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మోదీ వెన్నులో వణుకు పుట్టడం రేవంత్ రెడ్డి వెళ్లి చూశాడా అని.. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి.. మోదీ కాలి గోటి మీద ఉండే వెంట్రుకతో కూడా సమానం కాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డికి కూడా కేసీఆర్ గతి పడుతుందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-23T12:24:35Z dg43tfdfdgfd