కేసీఆర్​ మోకాళ్ల యాత్ర చేసినా.. బీఆర్ఎస్​కు డిపాజిట్ కూడా రాదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

కేసీఆర్​ మోకాళ్ల యాత్ర చేసినా.. బీఆర్ఎస్​కు డిపాజిట్ కూడా రాదు : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

  •  పిలిస్తే 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వచ్చేందుకు రెడీగా ఉన్నరు  
  • భువనగిరి, నల్గొండ ఎంపీ అభ్యర్థులు సర్పంచ్​లకు కూడా పనికిరారు 

నల్గొండ, వెలుగు: పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలను మాయ చేసేందుకు మాజీ సీఎం కేసీఆర్​బస్సు యాత్ర చేస్తున్నాడని, ఆయన మోకాళ్ల యాత్ర చేసినా నల్గొండ, భువనగిరిలో ఆ పార్టీకి డిపాజిట్ కూడా దక్కదని రాష్ర్ట రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. నల్గొండలో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్​మీట్​లో ఆయన మాట్లాడుతూ పదేండ్లు అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేని కేసీఆర్.. బస్సు యాత్ర ద్వారా ఏం చేస్తారని, మిర్యాలగూడకు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారని ప్రశ్నించారు. 

త్వరలో తండ్రీ, కొడుకులు జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. లిక్కర్ ​కేసులో అరెస్టయిన కవితకు బెయిల్​ దొరకదన్నారు. బీఆర్ఎస్ లీడర్ల గురించి మండలి చైర్మన్ ​గుత్తా బాగా చెప్పారని, జగదీశ్ రెడ్డిని ఉద్దేశించి గుత్తా చేసిన వ్యాఖ్యలకు ఆయనకు ధన్యావాదాలు చెబుతున్నానన్నారు. నల్గొండ, భువనగిరిలో బీఆర్ఎస్ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులు కనీసం సర్పంచ్ స్థాయికి కూడా పనికి రారన్నారు. కేసీఆర్​కు దమ్ముంటే మెదక్​లో తన పార్టీని గెలిపించుకోవాలని సవాల్​ విసిరిరారు. రాష్ర్టంలో ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదన్నారు. 

తాను పిలిస్తే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్​లోకి వచ్చేందుకు 25 మంది ఎమ్మెల్యేలు సిద్దంగా ఉన్నారని తెలిపారు. ఉమ్మడి జిల్లాను భ్రష్టు పట్టించిన సంస్కారహీనుడు జగదీశ్​రెడ్డి గురించి ఇక మాట్లాడనన్నారు. ఆయన గురించి మాట్లాడి తన స్థాయిని దిగజార్చుకోనన్నారు. నీటి పంపకాల విషయంలో ఆంధ్రా సీఎం జగన్, కేసీఆర్ లాలూచీ పడ్డారన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో తామంతా రాష్ట్ర అభివృద్ధి కోసం టీం వర్క్ గా పని చేస్తున్నామన్నారు. త్వరలో సూర్యాపేట, ఖమ్మం దవాఖానలకు వెళ్లి అక్కడ ఏసీలు ఏర్పాటు చేయిస్తానన్నారు. 

రాష్ట్రంలోని అన్ని ఐటీఐలలో స్కిల్ డెవలప్​మెంట్​ సెంటర్లు ఏర్పాటు చేసి యువతకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇండియా కూటమి అధికారంలోకి వస్తే హిందువుల బంగారం, ఆస్తులు దోచుకుంటారని మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. బీజేపీకి తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదన్నారు.  

©️ VIL Media Pvt Ltd.

2024-04-24T03:13:07Z dg43tfdfdgfd