ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల చేతిలో పల్లి రైతులు విలవిల
పల్లి రైతులు ప్రతిసారి ట్రేడర్లు, కమీషన్ ఏజెంట్ల చేతిలో మోసపోతున్నారు. మన రాష్ట్రంలోని ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌జిల్లాల్లో పల్లి ఎక్కువగా సాగవుతోంది. ఉమ్మడి పాలమూరులో గత వానకాలం 3.80 లక్షల ఎకరాల్లో పల్లి సాగైంది. డిసెంబరు చివరి వారం నుంచి పంట మార్కెట్‌కు రాగా, మొదట ప్రభుత్వం నిర్ణయించిన ఎంఎస్పీ రూ.6,377 కంటే ఎక్కువ రూ.8,300 నుంచి రూ.9,200 వరకు చెల్లించారు. మార్కెట్లోకి పల్లి రావడం పెరగ్గానే వ్యూహం ప్రకారం ధర తగ్గించారు. జనవరి రెండో వారం తర్వాత రేట్లు డౌన్ చేస్తూ వచ్చారు. రోజూ క్వింటాల్‌కు రూ.100 నుంచి రూ.300 వరకు తగ్గిస్తూ ఫైనల్‌గా మేలు రకం పల్లికి రూ.5 వేల కు తెచ్చి రైతులను మోసం చేశారు.
దీనికితోడు పంటను మార్కెట్‌కు తెస్తే అన్ని ఖర్చులు రైతులే భరించాల్సి వస్తోంది. కాంటాల సమయంలో హమాలీలు, చాట కూలీలకు కలిపి రూ.2 వేల వరకు ఇవ్వాల్సి వస్తోంది. వేరుశనగను కుప్పలుగా పోసినందుకు ఆ స్థానానికి అద్దె కింద కుప్పకు రూ.250 నుంచి రూ.300 వరకు మార్కెట్‌కు కడుతున్నారు. కాంటా జోకేటోళ్లకు సంచికి రూ.5, ట్రేడర్ల నుంచి గోనె సంచులను తీసుకున్నందుకు ఒకదానికి అద్దె కింద రూ.6 కడుతున్నారు. ఇవి కాకుండా కమీషన్ ఏజెంట్‌కు నూటికి రూ.5 చొప్పున చెల్లిస్తున్నారు.
©️ VIL Media Pvt Ltd. 2024-04-18T06:00:19Z dg43tfdfdgfd