'ప్రజల ఆస్తులను కాంగ్రెస్ లాక్కోవాలనుకుంటుంది'

PM Modi : పార్లమెంట్ ఎన్నికల వేళ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు  శామ్ పిట్రోడా చేసిన ప్రకటన రాజకీయ దుమారం రేపుతోంది. ఆయన వ్యాఖ్యలతో అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ నాయకుల మధ్య మాటల యుద్దం జరుగుతోంది.  సంపద పంపిణీపై సామ్ పిట్రోడా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకులు అమెరికా వారసత్వ పన్నుకు సంబంధించి భారతదేశంలో కొత్త చట్టం చేయాలని కోరుకుంటున్నారని ప్రధాని విమర్శించారు. తల్లిదండ్రుల నుండి పిల్లలు పొందిన వారసత్వ ఆస్తులపై కూడా కాంగ్రెస్ పన్ను విధించాలని భావిస్తుందని ఆరోపించారు. 

ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఛత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో విజయ్ సంకల్ప్ సభలో ప్రసంగిస్తూ..ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ చైర్మన్ శామ్ పిట్రోడా వారసత్వ పన్ను వ్యాఖ్యపై కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు, వారు (కాంగ్రెస్) మీ ఆస్తులు మరియు మీ పిల్లల హక్కులను లాక్కోవాలనుకుంటున్నారు. వారసత్వ పన్ను విధిస్తామని కాంగ్రెస్ అంటోందని మండిపడ్డారు.  వారసత్వ పన్నుపై పిట్రోడా చేసిన ప్రకటనపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ఈ ప్రకటనలో కాంగ్రెస్ ప్రమాదకరమైన ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు. సామాన్యుడికి తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తిపై కూడా పన్ను విధించాలని ఇంతమంది ఆలోచిస్తున్నారు.

దేశంలోని మధ్యతరగతి ప్రజలపై మరిన్ని పన్నులు వేయాలని రాజకుటుంబానికి చెందిన యువరాజుకు ఇదే సలహాదారుడు కొంతకాలం క్రితం చెప్పారని ఆయన అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు మరో అడుగు ముందుకేశారనీ,  వారసత్వపు పన్ను విధిస్తామని కాంగ్రెస్ అంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల నుండి పొందిన ఆస్తులపై పన్నులు వేసి.. ప్రజల ఆస్తులను లాక్కోవాలని భావిస్తుందని అన్నారు. ప్రజలు తాము కష్టపడి కూడబెట్టిన సంపదను తన పిల్లలకు అందకుండా చేయాలని,  కాంగ్రెస్ లాగేసుకోవాలని చూస్తుందని ప్రధాని ఆరోపించారు. ప్రజల( మీ) స్వంత ఆస్తులపై కాంగ్రెస్ కన్ను వేసిందని హెచ్చరించారు. ’మీరు కష్టపడి సంపాదించిన ఆస్తిని మీ పిల్లలకు ఇవ్వరు... మీరు బతికి ఉన్నంత కాలం ఎక్కువ పన్నులు విధిస్తూ కాంగ్రెస్‌ పంజా లాగేస్తుంది. మీరు మరణించిన తరువాత మీ సంపదపై  వారసత్వపు పన్ను భారం పడుతుంది, అలా చేస్తే.. తమ ఆస్తిని వారి పిల్లలకు పంపలేరు’ అంటూ కాంగ్రెస్‌పై విరుచుకుపడ్డారు.

ఇంతకీ శామ్ పిట్రోడా ఏమన్నారంటే?

‘సంపద స్వాధీనం’పై కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా  అభిప్రాయాన్ని తెలియజేస్తూ.. "అమెరికాలో వారసత్వపు పన్ను ఉంది. ఎవరికైనా 100 మిలియన్ డాలర్ల ఆస్తి ఉంటే.. అతను చనిపోయినప్పుడు అతను తన పిల్లలకు 45 శాతం మాత్రమే బదిలీ అవుతుంది. 55 శాతం ఆస్తిని ప్రభుత్వమే లాక్కుంటుంది. ఇది ఒక ఆసక్తికరమైన చట్టం. మీ తరంలో మీరు సంపదను సృష్టించి, ఇప్పుడు మీరు వెళ్లిపోతున్నారు, మీరు మీ సంపదను ప్రజలకు వదిలివేయాలి. మొత్తం కాదు, సగం. ఇదే న్యాయమైన చట్టం." అని పేర్కొన్నారు. 

 

2024-04-24T07:53:24Z dg43tfdfdgfd