KOTHAKOTA SRINIVAS REDDY: ఫోన్ ట్యాపింగ్‌ కేసులో రాజకీయ నేతలు.. ఎంతటివారైనా విడిచిపెట్టం.. సీపీ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోన్న ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే విచారణ జరుగుతుండగా.. సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ క్రమంలోనే.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై వెలువడుతున్న ఊహాగానాలపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతుందని సీపీ తెలిపారు. ఊహాగానాలతో దర్యాప్తుకు ఇబ్బంది కలిగిస్తున్నారంటూ సీపీ శ్రీనివాస్ రెడ్డి చెప్పుకొచ్చారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతుందని ఈ కేసులో ఎంతటి వాళ్లు ఉన్నా సరే వదిలిపెట్టేది లేదంటూ కీలక వ్యాఖ్యలు చెప్పారు.

మరోవైపు.. ఈ కేసులో పలువురు కీలక రాజకీయ నేతల హస్తం ఉందంటూ వస్తున్న వార్తలపై కూడా స్పందించిన శ్రీనివాస్ రెడ్డి.. ఆ అంశంపై కూడా దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న మాజీ ఇంటెలీజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీసులు ఇవ్వలేదని శ్రీనివాస్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. త్వరలోనే రెడ్ కార్నర్ నోటీసులు ఇస్తామని తెలిపారు.

ప్రభాకర్ రావును పట్టుకోవడం లేదన్న వాదన పూర్తిగా అవాస్తవమన్నారు. దర్యాప్తు అధికారులకు ప్రభాకర్ రావు అందుబాటులోకి రాలేదని.. ఆయన కోసం గాలింపు కొనసాగుతోందన్నారు. ప్రస్తుతానికి ప్రభాకర్ రావు అమెరికాలో ఉన్నట్లు సమాచారం అందుతోందని తెలిపారు. ఇప్పటికే ప్రభాకర్ రావుపైన ఎల్‌ఓసీ జారీ చేశామని.. అది ఇంకా ఫోర్సులో ఉందని.. ఇంటర్ పోల్‌ను కూడా ఇంకా స్పందించలేదని సీపీ తెలిపారు.

సరైన సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసు వివరాలు వెల్లడిస్తామని సీపీ తెలిపారు. ఇప్పటికే ఫోన్ టాపింగ్ వ్యవహారంలో విచారణ వేగవంతం చేశామన్నారు. ఈ కేసులో మాజీ గవర్నర్ పేర్ల మీద కూడా కొంతమంది తప్పుడు వార్తలు రాస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. నిజంగానే టాపింగ్ జరిగిందా లేదా అనే విషయాన్ని తేల్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

సమయం వచ్చినప్పుడు రాజకీయ నాయకుల వ్యవహారంపైనా స్పందిస్తామని అప్పటివరకు తప్పుడు వార్తలు రాయొద్దని హెచ్చరించారు. ఫోన్ టాపింగ్ కేసుతో వ్యక్తిగత జీవితాల్లోకి చేసి చోరబడ్డారని.. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే ప్రయత్నం చేశారని సీపీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T09:57:53Z dg43tfdfdgfd