పక్కా సమాచారంతో సోదాలు.. తలుపు తెరిచి చూసి పోలీసుల షాక్

illegal liquor worth 80 lakhs Seized in Pithapuram: ఏపీ ఎన్నికల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా మారిన నియోజకవర్గం పిఠాపురం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇక్కడి నుంచి పోటీ చేస్తుండటమే ఇందుకు కారణం. పిఠాపురంలో గెలుపును అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. కూటమి తరుఫున పవన్ కళ్యాణ్ పోటీ చేస్తుండగా.. ఆయన్ని ఓడించేందుకు వైసీపీ తరుఫున వంగా గీత బ రిలో ఉన్నారు. హోరాహోరీ పోరు సాగుతున్నపిఠాపురం నియోజకవర్గంలో శుక్రవారం భారీగా మద్యం పట్టుబడటం కలకలం రేపింది. పలు ఇళ్లల్లో సోదాలు చేసిన పోలీసులు.. నాలుగు ప్రాంతాల్లో అక్రమంగా మద్యం దాచినట్లు గుర్తించారు.

అక్రమంగా మద్యం దాచారన్న ఫిర్యాదుల ఆధారంగా.. ఎస్‌ఈబీ అధికారులు, పోలీసులు శుక్రవారం రాత్రి సంయుక్తంగా దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో నాలుగు ప్రాంతాల్లో మద్యం నిల్వలు దాచినట్లు గుర్తించారు. పిఠాపురంలోని జగ్గయ్యచెరువు, సాలిపేట, వైఎస్‌ఆర్‌ గార్డెన్‌, కుమారపురం కాలనీల్లో అక్రమంగా మద్యం నిల్వ చేసినట్గు పోలీసులు గుర్తించారు. ఈ ఇళ్లల్లో దాచిన రూ.80 లక్షల విలువైన మద్యం సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఒక ఇంట్లోనే సుమారు 2500 లీటర్ల మద్యం దొరకడం విశేషం.

మరోవైపు సోదాల్లో వేలకొద్దీ మద్యం సీసాలను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. సీసాలను బస్తాల్లో నిల్వచేసినట్లు చెప్పారు. ఈ స్థాయిలో అక్రమ మద్యం పట్టుబడటంతో ఈ ప్రాంతంలో సోదాలు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. పిఠాపురం నియోజకవర్గంలో గెలుపును అన్ని పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవటంతో.. ఓటర్లను ఆకర్షించేందుకు అన్నిరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే మద్యాన్ని పెద్ద సంఖ్యలో నిల్వ చేసినట్లు తెలిసింది. అయితే ఎన్నికల్లో మద్యం, నగదు సరఫరాను అడ్డుకునేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. పోలీసులతో పాటు ఫ్లయింగ్ స్వ్కాడ్‌లను ఏర్బాటు చేసి తనిఖీలు నిర్వహిస్తున్నారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T17:08:48Z dg43tfdfdgfd