2014లో ప్రధాని మోదీ ‘చాయ్ పే చర్చ’ చేసిన గ్రామంలో రైతుల సమస్యలన్నీ తీరిపోయాయా, అక్కడి రైతులు ఏమంటున్నారు?

‘‘నరేంద్ర మోదీ (అప్పటికి ఇంకా ప్రధాని కాలేదు) ఇక్కడకు వచ్చినప్పుడు 16,17 వాగ్దానాలు చేశారు. కానీ వాటిల్లో ఒక్కటి కూడా నెరవేరలేదు. మోదీ గ్యారంటీ అంటే ఇదేనా?’’

ఈ మాటలు చెబుతూ దిగంబర్ గుల్హానే తన రెండు చేతులను తలపైన పెట్టుకున్నారు. ఆయన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లా దబాడీ గ్రామంలో ఉంటారు.

2014 మార్చి 20న ప్రస్తుత ప్రధాని, అప్పటి ఎన్డీఏ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోదీ ఈ గ్రామంలోనే రైతులతో టీ తాగుతూ ‘చాయ్ పే చర్చ’ చేశారు.

దేశవ్యాప్తంగా 1500 మంది రైతులు ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్‌లో పాల్గొనగా, దబాడీ రైతులు మోదీతో ప్రత్యక్ష సంభాషణలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మోదీ రైతుల సమస్యలు తెలుసుకోవడమే కాకుండా, వాటికి పరిష్కారాన్ని కూడా చెప్పారు.

‘‘దేశంలో వ్యవసాయరంగంలో మార్పు తీసుకు వస్తానని నేను రైతులకు హామీ ఇస్తున్నాను. ప్రజల జీవన ప్రమాణాలు మారతాయి. గ్రామీణ భారత రూపురేఖలు మార్చేస్తాం. ఇందుకు కేవలం మీ మద్దతు కావాలి. దేశంలోని రైతుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకువస్తాం’’ అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా చెప్పారు.

2014లో ఎన్డీయే కూటమి అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

నరేంద్ర మోదీ ప్రధాని అయ్యారు.

దబాడీ రైతులతో ఆయన సంభాషించి పదేళ్ళవుతోంది.

ఇప్పుడు నరేంద్ర మోదీ మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు సామాన్య ప్రజల కోసమంటూ ఆయన మరోసారి ప్రచారంలో బిజీగా ఉన్నారు.

మరి, పదేళ్ళ కిందట ఆయన ఇచ్చిన హామీల పరిస్థితి ఏమిటి? ఆయన ప్రభుత్వ హయాంలో రైతుల జీవన ప్రమాణాలు ఏమైనా మారాయా?

‘చాయ్ పే చర్చ’ కార్యక్రమంలో మోదీ ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలతో మాట్లాడారు. మరి ఈ పదేళ్ళలో ఆ కుటుంబాలలో ఎలాంటి మార్పులు వచ్చాయి?

ఈ విషయాన్ని తెలుసుకోవడానికి బీబీసీ బృందం దబాడీ గ్రామాన్ని సందర్శించింది.

దబాడీకి ఉదయం 9 గంటలకల్లా చేరుకున్నాం. యవత్మాల్ జిల్లా అర్నీ తాలూకాలో ఈ గ్రామం ఉంది. గ్రామ కూడలిసమీపంలో ఓ పొలం ఉంది. ఆ పొలంలోనే ప్రధాని మోదీ ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమం జరిగింది.

కొంచెం ముందుకు నడుస్తూ మధ్యలో భాస్కర్ రౌత్ అనే రైతును కలిశాం. వారు పత్తిపంటను ఓ బండిలోకి ఎక్కిస్తున్నారు. కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), పత్తి సేకరణ ఆపేయడం వల్ల ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకుంటున్నట్టు ఆయన చెప్పారు. భాస్కర్‌కు నాలుగెకరాల పొలం ఉంది. అందులో పత్తిని పండిస్తుంటారు.

పులి నోట్లో తల, పాములపై కాళ్ళు

పత్తి ధరలు ఎలా ఉన్నాయని భాస్కర్‌ని అడిగాం.

‘‘పత్తి ధరలు తారుమారయ్యాయి. 15 రోజుల కిందటివరకు పత్తి ధర క్వింటాకు 7,700 రూపాయలుంది. కానీ ఈ రోజు 7,200 నుంచి 7,300 మధ్యన ఉంది. క్వింటాకు 9 వేల నుంచి10 వేల రూపాయలు వస్తే బాగుంటుందని ఆశిస్తున్నాం’’ అని చెప్పారు.

2014లో దబాడీలో జరిగిన మోదీ చాయ్‌పే చర్చలో పాల్గొన్న రైతులలో భాస్కర్ కూడా ఒకరు.

గడిచిన 10 ఏళ్ళలో రైతుల జీవితంలో వచ్చిన మార్పేంటి అనే ప్రశ్నకు భాస్కర్ స్పందిస్తూ ‘‘2014 తరువాత అంత సంతృప్తిగా ఏమీ లేదు కానీ కచ్చితంగా మార్పైతే కనిపిస్తోంది. వ్యవసాయోత్పత్తుల ధరలు అంతర్జాతీయ మార్కెట్ నిర్థరిస్తుంది. 2014కు ముందు కూడా పత్తి ధరలు తక్కువగానే ఉన్నాయి. ఈ పదేళ్ళలో ధరలు పెరిగాయి. కాంగ్రెస్ హయాంలోనే రైతుల ఆత్మహత్యలు మొదలయ్యాయి’’ అని చెప్పారు.

తనకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద ఏటా 6 వేల రూపాయలు అందుతున్నాయని భాస్కర్ చెప్పారు.

పీఎం కిసాన్ పథకం (ప్రధాన మంత్రి కిసాన్ సమ్మన్ నిధి) కింద కేంద్ర ప్రభుత్వం రైతులకు ఏటా 6 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది. ఈ పథకాన్ని 2019లో ప్రారంభించారు.

యవత్మాల్ జిల్లా పరిధిలో అభివృద్ధి పనులను ప్రధాని నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 28న ప్రారంభించారు.

ఈ సందర్భంగా పీఎం కిసాన్ లబ్ధిదారుల గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ ‘‘ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా 11 కోట్లమంది రైతుల ఖాతాలలో 3 లక్షల కోట్ల రూపాయలు జమ చేశాం. ఇందులో భాగంగా మహారాష్ట్ర రైతులు 30వేల కోట్ల రూపాయలు, యవత్మాల్ రైతులు 900 కోట్లు పొందారు’’ అని చెప్పారు.

కానీ ప్రధాని పంట బీమా పథకంతో భాస్కర్‌కు చేదు అనుభవం ఉంది.

ప్రధానమంత్రి పంటల బీమా యోజన అనేది ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంట నష్టం జరిగినప్పుడు, చాలినంత వర్షపాతం నమోదు కానప్పుడు, వడగళ్ళ వాన, వరదలు, కరవు, పంటలకు చీడలు.. తదితర నష్టాలను కవర్ చేస్తుంది.

ఈ పథకం గురించి భాస్కర్ మాట్లాడుతూ ‘‘పంటల బీమా పథకంలో మోసం జరుగుతోంది. కేవలం ఇద్దరు, ముగ్గురు రైతులు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు. మా పత్తి పంట దెబ్బతింది. బీమా కోసం దరఖాస్తు చేశాను. కానీ నాకు ఎటువంటి ప్రయోజనమూ అందలేదు’’ అని చెప్పారు.

దబాడీలో పీఎం కిసాన్ యోజన, పంటల బీమా యోజన లబ్ధిదారుల గురించి తెలుసుకోవడానికి మేం వ్యవసాయాధికారులను సంప్రదించాం.

‘‘పీఎం కిసాన్ యోజన ప్రయోజనాన్ని దబాడీలో 383 మంది రైతులు పొందుతున్నారు. 2023-24లో 550 మంది రైతులు 32 లక్షల 17 వేల రూపాయలను స్థానిక విపత్తు నష్టపరిహారం కింద పొందారు. పంట అనంతర బీమా సమస్యలు పరిష్కరించాల్సి ఉంది’’ అని అర్నీ తాలూకా వ్యవసాయాధికారి ఆనంద్ బత్కల్ బీబీసీకి చెప్పారు.

2014లో చాయ్ పే చర్చ టాక్ షోలో మోదీ మాట్లాడుతూ ‘‘రైతుల పంట ఉత్పత్తి వ్యయం కనిష్టంగా ఉండేలా చూడటం ప్రభుత్వ బాధ్యత. వ్యవసాయానికి ఉపయోగించే వస్తువుల ధరలన్నీ రైతులకు అతి తక్కువ ధరలో లభించాలి. అలాగే రైతులు ఉత్పత్తి చేసిన పంటకు న్యాయమైన ధరలు అందాలి’’ అని చెప్పారు.

ప్రస్తుతం పదేళ్ళ తరువాత కూడా దబాడీ రైతులు తమ పంటల గిట్టుబాటు ధరల కోసం ఎదురుచూస్తున్నారు.

‘‘ప్రభుత్వం నుంచి రైతులు ఆశిస్తున్నది ఒక్కటే. మా పంటలకు సరైన ధర లభించాలి. మేం దేనిని ఉచితంగా ఆశించడం లేదు. పంట ఉత్పత్తి వ్యయానికి తగినట్టుగా ధరలు ఉండాలి’’ అని భాస్కర్ చెప్పారు.

‘‘రాత్రివేళ బదులుగా పగటివేళే కరెంట్ ఇవ్వాలి. రైతుల తల పులి నోట్లో, కాళ్ళు పాములపై ఉంటున్నాయి. పొలంలో రైతులు జీవన్మరణ పోరాటం చేస్తున్నారు’’ అని భాస్కర్ పత్తిని బండిలోకి నింపుతూ చెప్పారు.

‘ప్రధానికి వ్యతిరేకంగా మాట్లాడలేం’

భాస్కర్‌తో మాట్లాడాకా ముందుకు సాగాం. ఓ ఇంటి ముందు ఆవు,దూడ కట్టేసి ఉన్నాయి. ఆ ఇల్లు డికీ కుటుంబానిది. ‘చాయ్ పే చర్చ’లో ఈ కుటుంబంతో మోదీ మాట్లాడారు.

నేను ఆ ఇంట్లోకి వెళ్ళాను. గోడలన్నీ పగుళ్లుపట్టి, మురికిగా ఉన్నాయి. అనికేత్ హాల్లో కూర్చుని కనిపించారు. ‘చాయ్ పే చర్చ’ జరిగినప్పుడు ఆయన వయసు 14 ఏళ్ళు.

తన తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారో ఆయన మోదీకి వివరించారు.

మమ్మల్ని చూసి, అనికేత్ వాళ్ళమ్మని పిలిచారు. ఆ పిలుపుతో 51 ఏళ్ళ మీరా దిలీప్ రావ్ డీకే హాల్లోకి వచ్చారు. ఆమె మాతో మాట్లాడటం మొదలుపెట్టారు.

‘‘వ్యసాయం గిట్టుబాటుకాక, నా భర్త 2005లో ఆత్మహత్య చేసుకున్నారు. మాకు బ్యాంకు అప్పు ఉంది. ఆ రోజు ఆయన మమ్మల్ని ముందుగా పొలానికి వెళ్ళమని, తాను వెనుక వస్తానని చెప్పారు. నేను కూలీలతో కలిసి పొలానికి వెళ్ళాను. ఆ సమయంలో అనికేత్ రెండో తరగతి చదువుతున్నారు. స్నేహ ఆరోతరగతిలో ఉంది. ఆయన పదే పదే అప్పు గురించి చెప్పేవారు. ఆరోజున మమ్మల్ని పొలానికి పంపి ఆయన ఇంట్లో ఉరివేసుకున్నారు’’

మహారాష్ట్రలో ఎవరైనా రైతు ఆత్మహత్య చేసుకున్నట్టు తేలితే, ఆ కుటుంబానికి ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తుంది. మీరాకు ఈ మేరకు సాయం అందింది. కానీ ఈ డబ్బుతోనే జీవితం గడపడం చాలా కష్టమైన విషయం.

దీంతో 2006 నుంచి మీరా అంగన్వాడీ సహాయకురాలిగా పనిచేస్తున్నారు.

‘‘ నా పిల్లలను ఎంతో కష్టపడి పెంచాను. వారికి పెద్ద చదువులు చెప్పించడం వల్ల ప్రయోజనం లేదు. ఈ రోజుల్లో లంచాలు లేకుండా ఏ పని జరగదు’’ అని చెప్పారు.

అనికేత్ అమరావతి నుంచి బీసీఏ పూర్తి చేశారు. ఆయన ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నారు.

మోదీ ‘చాయ్ పే చర్చ’ తరువాత రైతుల జీవితాల్లో ఏం మార్పు వచ్చిందని ప్రశ్నిస్తే‘‘ మేం రైతులకు ఎంతో చేస్తామని మోదీ చెప్పారు. కానీ ఏం చేయలేదు. సోయాబీన్, పత్తి రైతులకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మరోపక్క కూలీల రేట్లు పెరిగిపోయాయి’’

‘‘ఇప్పటిదాకా ఏమీ మారలేదు’’ అని అనికేత్ చెప్పారు.

అనికేత్ తల్లి కూడా ఇదే చెప్పారు. తమకు ఇప్పటివరకూ ఏ పథకానికి సంబంధించిన సాయమూ అందలేదని చెప్పారు. తన తండ్రి మరణం తరువాత తమ భూమి తమ అంకుల్ పేరుపైన బదిలీ అయిందని, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ప్రయోజనాలు ఆయనే పొందుతున్నారని అనికేత్ చెప్పారు.

2024లో మీ ఆదాయం రెట్టింపు అయ్యిందా? అని ప్రశ్నిస్తే అనికేత్ ‘లేదు’ అని బదులిచ్చారు.

‘‘రైతుల కోసం పథకాలు ఉన్నాయి. రైతులు వాటి ప్రయోజనాలు పొందుతున్నారు. కేంద్రప్రభుత్వం ఏమీ చేయడం లేదని చెప్పలేం. రాష్ట్రపభుత్వానికి కూడా బాధ్యత ఉంది. ఇక్కడ మూడుపార్టీల ప్రభుత్వం ఉంది. ఆకలి లేకపోయినా ఆ ముగ్గురు ఒకే ప్లేటులోని ఆహారాన్ని పంచుకుంటన్నారు’’ అని అనికేత్ చెప్పారు.

మా సంభాషణ కొనసాగుతుండగా, అనికేత్ అంకుల్ వినోద్ డికే ఇంట్లోకి వచ్చారు. ఆయన చేతులు చూస్తే పొలం నుంచి వస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఏం జరుగుతోందని ఆయనతో మాట్లాడటం మొదలుపెట్టాను. ‘‘పదిహేనురోజులుగా పొలాల్లో దీపాల్లేవు. సమస్య ఏమిటో కనిపెట్టి లైట్లు వెలిగేలా చూడగలిగాం. ఈ రోజు దీపాలు రాకపోయి ఉంటే పంట మొత్తం నష్టపోవాల్సి వచ్చేది’’ అని చెప్పారు.

ఈ పదేళ్ళలో మీ జీవితంలో ఎలాంటి మార్పు వచ్చిందని అడిగితే ‘‘ఏమీ మారలేదు. పరిస్థితులు ఎలా ఉన్నాయో మీరూ చూడండి. ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లలకు భరోసా కల్పిస్తామని చెప్పారు. కానీ ఏమీ చేయలేదు. అయినా మోదీ భారత ప్రధాని. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు’’

మేము ఆరోజు మధ్యాహ్నం ఊరి మధ్యలో తిరుగుతుంటే ఎలాంటి సర్వే చేస్తున్నారని గ్రామస్తులు అడిగారు. నేను ఆ ఊరుపేరును ఫోటో తీసుకుంటుంటే ఇద్దరు యువకులు మోటారు సైకిల్ పై వచ్చి ఏం పని అని ప్రశ్నించారు.

బ్యానర్ ఎందుకు తగిలించారంటే..?

దబాడీ గ్రామ జనాభా 3వేలు. అక్కడ ప్రజలకు వ్యవసాయమే జీవనాధారం.

కొంతమంది ప్రజలు పనిచేయడానికి అర్నీ తాలూకాకు వెళతారు.

కొంతమంది అక్కడి షాపుల్లో పనిచేస్తారు.

దబాడీలో ఖరీఫ్ సీజన్‌లో పత్తి, సొయాబీన్ పంటలు పండుతాయి.

రబీలో గోదుమ, పప్పు ధాన్యాలు పండిస్తారు.

ఆ గ్రామంలో వ్యవసాయానికి కాలువలు, బావుల నీరే ఆధారం.

కొద్దిసేపటి తరువాత విజయ్ వాంఖడేని కలిశాం.

ఆయన దబాడీ సర్పంచ్ సరిత వాంఖడే భర్త.

విజయ్‌కు 10 ఎకరాల పొలం ఉంది.

‘‘నేను కూడా పదేళ్ళ కిందట మోదీ కార్యక్రమంలో పాల్గొన్నాను. ఆ కార్యక్రమం తరువాత మా జీవితాల్లో ఎటువంటి మార్పు రాలేదు. అంతకుముందు ఎలా ఉన్నామో ఇప్పుడు అలానే ఉన్నాం. 2014 తరువాత కూడా గ్రామంలో ఒకరిద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.’’

‘‘బట్టల మిల్లలు, సొయాబీన్ శుద్ధి పరిశ్రమలు పెడతామని మోదీ హామీ ఇచ్చారు. ఆయన నిజంగా ఆ హమీలు నెరవేరుస్తారని ప్రజలు నమ్మారు. మోదీ ప్రధాని అయ్యాక మేమంతా ఎంతో సంతోషించాం. మా జీవితాలు బాగుపడతాయని భావించాం’’ అని చెప్పారు.

‘‘మోదీ తను చేసిన వాగ్దాలను గుర్తుచేస్తూ గ్రామంలో ఓ బ్యానర్ పెట్టాం. మీరు హామీలు ఇచ్చారు. కానీ వాటిని నెరవేర్చలేదు. వీటిపై కొంత దృష్టి సారించండి’’ అని అందులో రాశారు. ఈ బ్యానర్ ముందు నిలబడి ఓ చానల్‌తో మాట్లాడిన రైతులను ఓ రోజంతా నిర్బంధంలో ఉంచారు. ఆర్నే తాలూకాలో జరిగే మోదీ కార్యక్రమానికి వారెక్కడ అంతరాయం కలిగిస్తారోననే ఉద్దేశంతో వారిని నిర్బంధంలో ఉంచారు.

ఫిబ్రవరి 28, 2024న యవత్మాల్ జిల్లాలో వివిధ ప్రాజెక్టులను నరేంద్ర మోదీ ప్రారంభించాల్సి ఉంది. ఈ సమావేశానికి ముందు దబాడీ గ్రామ ప్రజలు తమకు మోదీ చేసిన వాగ్దాలను గుర్తుచేస్తూ ఈ బ్యానర్‌ను ఏర్పాటుచేశారు.

ఈ బ్యానర్ ముందు నిలబడి కొంతమంది గామస్తులు మీడియాతో మాట్లాడారు. వీరిలో దిగంబర్ గల్హానే, గణేష్ రాథోడ్ కూడా ఉన్నారు. మోదీ కార్యక్రమానికి ముందు అర్నే పోలీసులు వారికి నోటీసులు జారీ చేశారు.

‘‘ఫిబ్రవరి 25న మేం ఓ ఛానల్‌తో మాట్లాడాం. దీని తరువాత మాకో నోటీసు ఇచ్చారు. నేను, గణేష్ రాథోడ్ రోజంతా అర్నీ పోలీసు స్టేషన్ లో నిర్బంధంలో ఉన్నాం. మోదీ సమావేశానికి ముందు మేం ఎటువంటి గొడవా చేయకుండా చూడాలనే ఉద్దేశంతో మమ్నల్ని నిర్బంధంలోకి తీసుకున్నారు. మమ్మల్ని అక్కడే కూర్చునేలా చేశారు. కానీ మేం నిజమే చెప్పాం.

బాబా సాహెబ్‌కు ఏం చెబుతారు?

దిగంబర్‌కు మూడెకరాల పొలం ఉంది. ఆయన పత్తి పంట పండిస్తున్నారు.

‘‘ఇది పత్తి పంటకు నెలవైన జిల్లా. టెక్స్‌టైల్ పరిశ్రమలు నెలకొల్పుతామని, రైతుల పిల్లల కోసం షాపులు తెరుస్తామని మోదీ ఎన్నో ప్రకటనలు చేశారు. కానీ ఆయన దేనిని నెరవేర్చలేదు’’

2014లో జరిగిన చాయ్ పే చర్చా వేదికలో, యవత్మాల్, విదర్భ ప్రాంతాలలోని సోయబీన్, కాటన్ రైతులకు ఎటువంటి ధరలు కల్పించనున్నారని? అప్పటి దబాడీ సర్పంచ్ మోదీని ప్రశ్నించారు

దీనిపై మోదీ స్పందిస్తూ ‘‘ఇక్కడ పత్తి పంటలు పండించేవారికి ధరలు పెంచుతాం. ప్రస్తుతం ఇక్కడ ఏం జరుగుతోందంటే ఇక్కడ పత్తిని పండిస్తున్నారు. కానీ దారం తయారీకి కొల్హాపుర్ వెళుతున్నారు. పత్తి ఇక్కడే పండేటప్పుడు దారం ఇక్కడే ఎందుకు తయారుచేయకూడదు. దారం ఇక్కడే తయారు అయ్యేటప్పుడు బట్టలు, రెడీమేడ్ బట్టలు ఇక్కడే ఎందుకు తయారుచేయకూడదు. ఇది పత్తి విలువను పెంచుతుంది. పత్తి రైతులు వీటి నుంచి ప్రయోజనం పొందుతారు’’ అని చెప్పారు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2వేల రూపాయలు ఇచ్చారని దిగంబర్ చెప్పారు.

‘‘పీఎం కిసాన్ యోజన కింద మోదీ 2వేల రూపాయలు ఇస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో మేం డీఏపీ ఎరువు తీసుకుంటున్నాం. దాని ధర 500 రూపాయలు ఉండేది. ఇప్పుడు మేం దాని కోసం 1700 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తోంది. లక్షరూపాయల విలువైన ఎరువులు కొంటే, 18వేల రూపాయలు జీఎస్టీగా చెల్లించాల్సి వస్తోంది. పోలీసుల నోటీసులు గురించి ప్రస్తావించగా ‘‘అలా చేయడం సరికాదు. బాబా సాహెబ్ ఇచ్చిన అధికారాన్ని మేం ఉపయోగించుకుంటున్నాం. మేం మాట్లాడకపోతే బాబా సాహెబ్ కు ఏమని సమాధానం ఇచ్చినట్టు, నేను నిజం మాట్లాడుతూనే ఉంటాను’’ అని చెప్పారు.

భాస్కర్ రౌత్ లానే దిగంబర్ గుల్హానే కూడా పంటల బీమా గురించి తన అనుభవాన్ని పంచుకున్నారు.

‘‘పంటల తనిఖీకి వచ్చే వ్యక్తికి 500 రూపాయలు చెల్లించాలి. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం అవినీతి మయం కాదని ఎలా చెప్పగలుగుతారు’’?

ఈ విషయమై అర్నీ తాలూకా వ్యవసాయాధికారి ఆనంద్ బత్కల్ మాట్లాడుతూ పంటల బీమా తనిఖీ కోసం ఎవరైనా డబ్బు వసూలు చేస్తే రైతులు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేస్తే సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.

‘‘పంటల బీమా తనిఖీ కోసం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని మేం విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని బత్కల్ చెప్పారు.

‘‘మాకేమీ పీఎం కిసాన్ డబ్బులు , రుణాల రద్దు అవసరం లేదు. మా పంటలకు తగిన ధరలు కల్పిస్తే చాలు. ప్రపంచానికి అన్నం అందించేది రైతులే. ప్రభుత్వం దీని గురించి ఆలోచించాలి.

ఎమ్మెల్యేలు ఏం చెబుతున్నారు?

ఆర్నీ-ఖేలాపూర్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం బీజేపీకి చెందిన సందీప్ ధ్రువ్ ఉన్నారు.

దబాడీ గ్రామంలో అభివృద్ధి పనుల గురించి ఆయనను ప్రశ్నిస్తే.. ‘దబాడీ గ్రామంలో ప్రధాన సమస్య వంతెన. గ్రామాన్ని, ఆలయాన్ని ఈ వంతెనే కలుపుతుంది. ఈ పనికి 2.5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. భూమి పూజ కూడా జరిగింది. రక్షిత మంచినీటి ప్లాంట్ పనులు కూడా జరుగుతున్నాయి’’

2014లో నరేంద్రమోదీ చేసిన వాగ్దానాలేవీ నెరవేర్చలేదు. దీనిపై గ్రామస్తులలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీని గురించి సందీప్ ధ్రువ్ ను అడిగితే ‘‘నరేంద్ర మోదీ అప్పట్లో శుద్ధి కర్మాగారాన్ని గురించి మాట్లాడారు. ఇందుకోసం ఎవరైనా వ్యాపారులు ముందుకు రావాల్సి ఉంది. కానీ పత్తి, సొయాబీన్ శుద్ధి కర్మాగారాల కోసం ఎవరూ ముందకు రావడం లేదు’’ అని చెప్పారు.

ఆర్నీ-ఖేలాపూర్ నియోజకవర్గం చంద్రాపూర్ లోక్‌సభ పరిధిలోకి వస్తుంది. ప్రస్తుత ఎంపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న సుధీర్ మునగాన్తీవర్ పత్తి ఆధారిత శుద్ధి కర్మాగారం ఏర్పాటుకు హామీ ఇస్తున్నారు అని సందీప్ చెప్పారు.

‘రైతులకు మోదీ ఎంతో చేశారు..’

2014లో ‘చాయ్ పే చర్చ’ కార్యక్రమంలో పాల్గొనే ముందు నరేంద్రమోదీ కైలాష్ అర్నాకర్ పొలానికి వెళ్ళారు. అక్కడ దెబ్బతిన్న పంటను చూశారు. మేం గ్రామం నుంచి తిరిగొస్తుంటే గ్రామ కూడలి నుంచి ఆ పొలం కనిపించింది.

‘‘చాయ్ పే చర్చ జరిగిన రోజు సాయంత్రమే మోదీ మధ్యాహ్నం 3గంటల సమయంలో దెబ్బతిన్న మా పొలాలను పరిశీలించారు. అప్పుడు వడగళ్ళ వానకారణంగా గోదుమ, తృణధాన్యాల పంటలు దెబ్బతిన్నాయి. అంతకుముందు గ్రామంలో 17మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.’’

మోదీ పదేళ్ళ పాలనపై మాట్లాడుతూ ‘‘ మోదీ గ్రామానికి వచ్చినప్పుడు మా సమస్యలేమిటో చెప్పండి అని అడిగారు. మోదీ ఎటువంటి భరోసా ఇవ్వలేదు. కానీ మంచినీటి ట్యాంక్‌ నిర్మాణమైంది. ఆలయంలో సమావేశ మందిరం నిర్మించారు. ప్రజలు అర్థం చేసుకోవడం లేదు. ప్రధాని రైతుల కోసం ఎంతో చేశారు’’.

మేం గ్రామంలో మధ్యాహ్నం ఒంటిగంటకల్లా ఓ కూడలి వద్దకు చేరుకున్నాం. అక్కడ కొంతమంది గ్రామస్తులు మాట్లాడుకుంటున్నారు. ఎన్నికల వాతావరణం ఎలా ఉందని అడిగితే ‘‘మేం దాని గురించి మాట్లాడం’’ అని చెప్పారు.

మరొకరు ‘‘ఏమడుగుతున్నారు మీరు?’’ అని స్థానిక యాసలో మాట్లాడటం మొదలుపెట్టారు.

ప్రధాని మోదీ వచ్చి వెళ్లాకా ఏం మార్పు వచ్చిందని ప్రశ్నిస్తే ఒకతను మాట్లాడుతూ ‘‘ ఏమీ జరగలేదు. అందుకే మేం ‘చాయ పే చర్చ’ పై ఓ బ్యానర్ పెట్టాం’’ అని చెప్పారు.

అయితే అనిల్ రాథోడ్ అనే వ్యక్తి వారిని ఆపుతూ గ్రామంలోని వాటర్ ట్యాంక్‌ను చూపుతూ ‘‘2014 తరువాత మంచినీటి సరఫరా కోసం కోటి రూపాయల విలువైన ట్యాంక్ నిర్మించారు. హన్సరాజ్ అహిత్ హోం మంత్రిగా ఉన్నప్పుడు 50 లక్షల రూపాయల విలువైన ట్యాంక్ నిర్మించారు. సిమెంట్ రోడ్లు వేశారు. మోదీ గ్రామానికి వచ్చాకా అభివృద్ధి అభివృద్ధి జరిగింది కానీ అది ఆశించిన స్థాయిలో జరగలేదు’’

హన్సరాజ్ అహిర్ విదర్భకు చెందిన బీజేపీ నాయకుడు. ఆయన కేంద్ర సహాయ హోం మంత్రిగా ఉన్నారు.

గ్రామంలో ఇంకా ఏం కావాలని ప్రశ్నిస్తే ‘‘గ్రామంలో ఓ బ్యాంకు కావాలి. పిల్లలు ఆడుకోవడానికి స్టేడియం కావాలి. రైతుల కోసం వెయ్యి, రెండువేల బస్తాలు పట్టే గోదాము అవసరం ఉంది’’ అని చెప్పారు.

‘‘మన దేశం చాలా పెద్దది. ప్రభుత్వం చాలా విషయాలు పట్టించుకోవాలి. అన్నీ ఒకే రోజు జరగవు. ఈ ఐదేళ్ళలో మాఎమ్మెల్యే ఒక్కసారి కూడా మమ్మల్ని కలవడానికి రాలేదు’’.

దబాడీ గ్రామ వివాదాలను పరిష్కరించే తంతాముక్తి కమిటీ మాజీ చైర్మన్ కిషన్ చవాన్ మాట్లాడుతూ ‘‘యవత్మల్ జిల్లాకు మోదీ వచ్చినప్పుడల్లా ఆయన మా గ్రామం పేరు ప్రస్తావిస్తారు. కానీ ఈసారి ఆయన ఆ సంప్రదాయాన్ని మరిచిపోయారు’’

దీనిపై అనిల్ రాథోడ్ మాట్లాడుతూ ‘‘మా గ్రామం న్యూస్ చానల్స్ కారణంగా ఎంతో నష్టపోయింది. చానల్స్ వచ్చినప్పుడల్లా ప్రజలందరూ మా ఊళ్ళో ఏం జరగలేదని చెబుతున్నారు. దీంతో గ్రామ ప్రజలు సరిగా చెప్పడం లేదని నాయకులు భావిస్తున్నారు. దీంతో వారు గ్రామం కోసం ఏం చేయడంలేదు’’.

ఆగని ఆత్మహత్యలు

వ్యవసాయంలో ఎదురయ్యే సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కావని 2014లో నరేంద్ర మోదీ ఈ గ్రామంలో చెప్పారు.

‘‘మనందరం కలిసి ఈ సమస్యకు పరిష్కారం కనుగొనాలి. దిల్లీలో ఏర్పాటయ్యే ప్రభుత్వం రైతుల పట్ల, వారి సమస్యల పట్ల చిత్తశుద్ధితో ఉండి, ప్రగతిశీల పథకాలతో రైతులకు రక్షణగా నిలిస్తే, రైతులు అభివృద్ధి చెందుతారు’’ అని చెప్పారు.

కానీ 2014 తరువాత కూడా దబాడీ గ్రామంలో ఆత్మహత్యలు జరుగుతున్నాయి.

గణేష్ రాథోడ్ అంకు విఠల్ రాథోడ్ 2015లో ఆత్మహత్య చేసుకున్నారు.

‘‘మోదీ అధికారంలోకి వచ్చాకా 2015లో మా అంకుల్ ఆత్మహత్య చేసుకున్నారు. దీని తరువాత ప్రభుత్వం నుంచి మాకు ఆర్థిక సాయం అందింది’’ అని గణేష్ బీబీసీకి చెప్పారు.

ధ్యానేశ్వర్ మన్కర్ సోదరుడు కూడా 2017లో ఆత్మహత్య చేసుకున్నారు. ఆయన పేరు కైలాష్ మన్కర్. అప్పుల బాధ భరించలేక కైలాష్ ఆత్మహత్య చేసుకున్నారని ధ్యానేశ్వర్ చెప్పారు.

మహారాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం 2024లో మొదటి రెండు నెలల్లోనే 427మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. వీటిల్లో గరిష్ఠంగా 48మంది యవత్మల్ జిల్లాకు చెందినవారే.

ఫిబ్రవరి 28, 2024న యవత్మల్ జిల్లాలో వివిధ ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి హాజరైన ప్రధాని యవత్మల్ జిల్లా ప్రజలను కొనియాడారు.

‘‘నేను యవత్మల్ జిల్లాలకు పదేళ్ల కిందట వచ్చినప్పుడు చాయ్ పే చర్చలో మీరు నన్నెంతగానో ఆశీర్వదించారు. మళ్ళీ నేను 2019లో వచ్చాను. అప్పుడూ అదే ప్రేమ కురిపించారు. ఇప్పుడో మరోసారి 2024 ఎన్నికల ముంగిట వచ్చినప్పుడు ఈ సారి 400 సీట్లు దాటాలి అనే నినాదం దేశమంతటా మారుమోగుతోంది’’ అని చెప్పారు.

‘‘యవత్మల్ జిల్లాలో పేదలను, రైతులను, మహిళలను, యువతను శక్తిమంతంగా చేసేందుకు పనులు సాగుతున్నాయి. రైతులకు ఇప్పుడు నీటిపారుదల సౌకర్యలు పొందుతున్నారు. పేదలకు శాశ్వత నివాసగృహాలు లభిస్తున్నాయి. గ్రామీణ మహిళలకు ఆర్థిక సాయం అందుతోంది. యువత తమ భవితను నిర్మించుకునేందుకు వీలుగా ప్రాథమిక సౌకర్యాల కల్పన సాగుతోంది’’ అని చెప్పారు.

‘‘గడిచిన పదేళ్ళుగా గ్రామంలో నివసించే ప్రతి కుటుంబంలోని సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నాం’’ అని చెప్పారు.

నిపుణుల మాటేంటి?

‘చాయ్ పే చర్చ’లో కిషోర్ తివారి అనే నీటిపారుదల రంగ నిపుణుడు మోదీతో సంభాషించారు. తివారీ విదర్భ ప్రాంతంలో వ్యవసాయరంగ సమస్యలపై అనేక ఏళ్ళుగా పనిచేస్తున్నారు. యూపీఏ1, 2 ప్రభుత్వాల హయాంలో విదర్భ ప్రాంతంలో 11వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని, రైతుల ఆత్మహత్యలకు కారణంగా కనిపిస్తున్న ఈ రైతు వ్యతిరేక విధానాలను ఎన్డీఏ ప్రభుత్వం కూడా కొనసాగిస్తుందా అని ప్రశ్నించారు.

దీనిపై మోదీ స్పందిస్తూ నదుల అనుసంధానం ద్వారా నీటి పారుదల వ్యవస్థ మెరుగుపరచడం గురించి మాట్లాడారు. ‘‘దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరిస్తాం. వ్యవసాయ అనుకూల విధానాలను బలోపేతం చేస్తాం. అటల్ బిహారి వాజ్‌పేయ్ తీసుకున్న చొరవను బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే మరింత బలోపేతం చేస్తుంది’’ అని చెప్పారు.

మరి గడిచిన 10 ఏళ్ళల మోదీ రైతులకు పనికొచ్చే విధానాలను బలోపేతం చేశారా? ‘‘తన ప్రభుత్వం రైతుల సమస్యలపై పనిచేస్తుందని మోదీజీ చెప్పారు. 2019వరకు ఆ దిశలోనే పనిచేశారు. కానీ 2019 తరువాత వాటిని వదిలేశారు. ప్రభుత్వ పథకాల కింద రైతులకు పెద్దగా ప్రయోజనమేమీ కలగలదు. మోదీ హయాంలో కూడా అనేకమంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు’’ అని కిషోర్ తివారీ చెప్పారు.

ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు చెందిన అనికేత్, మీరాలకు ప్రభుత్వంపై ఇంకా నమ్మకం ఉంది. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం రెండు అంశాలపై దృష్టి పెట్టాలని వారు కోరారు.

‘‘ప్రభుత్వం వీలైనన్ని ఖాళీలను భర్తీ చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి. ప్రభుత్వం రైతుల కోసం నిలబడాలి. ప్రభుత్వం ప్రవేశపెట్టే కొన్ని పథకాల గురించి రైతులకు తెలియడంల లేదు.

మీరా మాట్లాడుతూ ‘‘మా పిల్లలకు ఉద్యోగాలు రావాలి. రైతుల పంటలకు సరైన ధర చెల్లించాలి’’ అని కోరారు.

మేం అనికేత్ ఇంటి నుంచి బయటకు వచ్చేటప్పుడు మమ్మల్ని సాగనపేందుకు అనికేత్, అయన తల్లి గుమ్మం వరకు వచ్చారు. మేం వారికి వెళ్ళొస్తాం అని చెబుతున్నప్పుడు ‘‘సార్ ఉద్యోగాలు ఏమైనా ఉంటే చెప్పండి’’ అని అనికేత్ కోరారు.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

ఇతర కథనాలు

2024-04-24T12:52:58Z dg43tfdfdgfd