NOTA: నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే ఎన్నికల నిర్వహణ.. ఈసీకి సుప్రీంకోర్టు నోటీసులు?

NOTA: ప్రస్తుతం దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటర్లు తమకు ఇష్టమైన పార్టీకి, నచ్చిన అభ్యర్థికి ఓటు వేస్తారు. ఒక్కో నియోజకవర్గంలో చాలా మంది పోటీలో నిలుస్తూ ఉంటారు. పార్టీల తరఫున కొందరు పోటీ చేస్తే.. మరికొందరు ఇండిపెండెంట్‌లుగా ఎన్నికల బరిలో నిలుస్తారు. అయితే ఓటర్లు తమ నియోజకవర్గానికి ఎవరిని ఎన్నుకోవాలని ఆలోచించి ఎవరో ఒకరికి ఓటు వేస్తారు. ఆ నియోజకవర్గంలో పోటీలో ఉన్న ఏ అభ్యర్థి కూడా నచ్చకపోతే నోటా (None Of The Above) పై నొక్కి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అయితే ఏదైనా నియోజకవర్గంలో పోటీలో ఉన్న అభ్యర్థుల కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వస్తే.. ఆ ఎన్నికను రద్దు చేసి మళ్లీ ఎన్నికలు నిర్వహించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు ఇచ్చింది.

నోటా కంటే ఎక్కువ ఓట్లు పోలైతే ఆ ఎన్నికను రద్దు చేసి.. మళ్లీ నిర్వహించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ శివ్‌ ఖేరా అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వాజ్యంపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. అంతేకాకుండా నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్ధులను.. మళ్లీ అదే నియోజకవర్గంలో మరో 5 ఏళ్ల వరకు జరిగే ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. నోటాను కల్పిత అభ్యర్థిగా పేర్కొంటూ సమర్థవంతమైన ప్రచారాన్ని కల్పించేలా నిబంధనలను రూపొందించాలని కోరారు.

ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ జేబీ పార్ధివాలా, జస్టిస్ మనోజ్‌ మిశ్రాలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం.. దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు ఇచ్చింది. ఇక శివ్ ఖేరా తరఫున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణ వాదిస్తూ.. సూరత్‌లో కాంగ్రెస్ అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురికావడం, ఇతర అభ్యర్థులు తమ నామినేషన్లను విత్ డ్రా చేసుకోవడంతో ఎన్నికలు లేకుండానే బీజేపీ అభ్యర్థిని విజేతగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే పోటీలో ఒకే అభ్యర్థి ఉన్నప్పటికీ.. ఎన్నికలు నిర్వహించాల్సి ఉండాల్సింది అని.. ఓటర్లకు ఆ అభ్యర్థి నచ్చకపోతే నోటాకు ఓటేసేవాడని తెలిపారు. మంచి అభ్యర్థులను నిలబెట్టేలా రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావడమే నోటా ప్రధాన ఉద్దేశ్యమని పేర్కొన్నారు.

నోటాను చెల్లుబాటు అయ్యే అభ్యర్థిగా పరిగణించడంలో కేంద్ర ఎన్నికల సంఘం విఫలమైందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. ప్రజాస్వామ్యంలో నోటా అవసరమని ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. దీనిపై స్పందించిన సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. ఇది ఎన్నికల ప్రక్రియకు సంబంధించిందని.. పిటిషన్‌పై స్పందించాలంటూ ఈసీకి నోటీసులు జారీ చేసింది.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T13:13:01Z dg43tfdfdgfd