పెరుగుతున్న ఓటర్లు.. తగ్గుతున్న ఓటింగ్.​.!

పెరుగుతున్న ఓటర్లు.. తగ్గుతున్న ఓటింగ్.​.!

  • వరంగల్ పార్లమెంట్ స్థానంలో తగ్గుతూ వస్తున్న పోలింగ్ శాతం
  • మూడు ఎలక్షన్స్ పోలిస్తే 13 శాతం డౌన్
  • మహబూబాబాద్ లోనూ సేమ్ సీన్
  • ఫలితాలనివ్వలేకపోతున్న అధికారుల చర్యలు
  • ఎవరికి ఎఫెక్ట్ పడుతుందోనని నేతల్లో టెన్షన్

హనుమకొండ, వెలుగు : ఉమ్మడి వరంగల్​ జిల్లాలో ఓటర్లు పెరుగుతున్నా..  ఓటింగ్​తగ్గుతుంది. ఎలక్షన్ల టైంలో ఓటేసేందుకు ప్రజలు ఆసక్తి చూపకపోవడం, ఆఫీసర్లు ఓటర్​ చైతన్యానికి నామమాత్రపు చర్యలు తీసుకుంటుండడంతో పోలింగ్​శాతం పడిపోతుంది. రాష్ర్టం ఏర్పడిన తర్వాత వరంగల్​ ​పార్లమెంట్​స్థానానికి బైపోల్​తో కలిపి మూడుసార్లు ఎన్నికలు జరుగగా, ఐదేళ్లలోనే 13 శాతం ఓటింగ్​తగ్గింది. పోలింగ్​శాతం తగ్గుతుండడంతో ఈసారి ఎవరిపై ప్రభావం పడుతుందోనని ఎంపీ అభ్యర్థుల్లో టెన్షన్ ​నెలకొంది. 

పడిపోతున్న ఓటింగ్​ శాతం..

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో వరంగల్ తూర్పు, పశ్చిమ, వర్ధన్నపేట, పరకాల, భూపాలపల్లి, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. 2014 ఎన్నికల్లో 15,37,778 లక్షల మంది ఓటర్లు ఉండగా, 2019 లో 16,66,085 మంది ఓటర్లయ్యారు. ప్రస్తుతం ఈ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 18,16,543 మంది ఓటర్లు నమోదై ఉన్నారు. ఇలా ఓటర్ల సంఖ్య పెరుగుతున్నా, పోలింగ్ శాతం మాత్రం నమోదు కావడం లేదు. కారణం ఏదైనా ఓటు వేయడానికి మాత్రం ఓటర్లు ఆసక్తి చూపడం లేదు. 2014లో ఎంపీ ఎలక్షన్లలో 76.52 శాతం పోలింగ్ నమోదు కాగా

ఎంపీగా గెలిచిన కడియం శ్రీహరి రాజీనామాతో 2015లో బై ఎలక్షన్ నాటికి తగ్గింది. 2019 ఎన్నికలకు 63.7 శాతానికి పడిపోయింది. 2014తో పోలిస్తే 2019 నాటికి పోలింగ్ పర్సంటేజీ దాదాపు 13 శాతం ఓటింగ్ తగ్గినట్లు తెలుస్తోంది. ఓటరు నమోదుకు వివిధ కార్యక్రమాలు చేపడుతున్న జిల్లా అధికారులు, ఓటింగ్ పర్సంటేజీ పెంచేందుకు సరైన చర్యలు చేపట్టడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

అసెంబ్లీతో పోలిస్తే మరింత డౌన్..

గతంతో పోలిస్తే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓటింగ్ శాతం తగ్గుతూ వస్తోంది. కాగా, అసెంబ్లీ ఎలక్షన్స్ తో పోల్చినప్పుడు ఎంపీ ఎన్నికల నాటికి పోలింగ్ శాతం మరింతగా తగ్గుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో వరంగల్ పార్లమెంట్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో దాదాపు 12,70,497 మంది ఓటేయగా, ఎంపీ ఎన్నికల్లో మాత్రం 10,60,412 మంది మాత్రమే పోలింగ్ లో పాల్గొన్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా 18 లక్షల మంది ఓటర్లకు దాదాపు 14 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు.  

మహబూబాబాద్​లోనూ అదే పరిస్థితి..​

గత రెండు లోక్ సభ ఎన్నికలను పోలిస్తే మహబూబాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలోనూ ఓటింగ్ శాతం తగ్గింది. ఇక్కడ 15 లక్షలకుపైగా ఓటర్లు ఉండగా, 2014 లోక్ సభ ఎన్నికల్లో 11.26 లక్షల మంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఓవరాల్​గా 81.21 పోలింగ్ శాతం నమోదు కాగా,  2019 ఎన్నికల్లో 69.06 శాతం ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీకి మెజార్టీ దక్కింది. పోలింగ్​ పర్సంటేజీ పెరిగితే ఎవరికి అనుకూలంగా మారుతుందోనన్న ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ఓటర్ నమోదు, అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్న అధికారులు పోలింగ్ పర్సంటేజీ పెంచేందుకు ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.

  ©️ VIL Media Pvt Ltd.

2024-04-24T01:57:58Z dg43tfdfdgfd