హైదరాబాద్‌లో ఇంటర్నేషనల్ గ్యాంగ్.. రోడ్డుపై నడుస్తూ వెళ్లేవారే టార్గెట్.. రాత్రి 10 గంటల తర్వాతే ఎక్కువ..!

ప్రస్తుతం.. మొబైల్ అనేది మనిషికి నిత్యావసరమే కాదు.. అన్ని వేళలా తోడుండే అత్యవసర వస్తువుగా మారిపోయింది. పొద్దున లేచిన దగ్గరి నుంచి పడుకునే వరకు చేతిలో మొబైల్ ఉండాల్సిందే. అయితే.. రోడ్డుపై నడుస్తున్న సమయంలోనూ ఫోన్లు మాట్లాడుతుంటారు జనాలు. ఇంకొందరైతే.. ఫోన్‌లో మాట్లాడుకుంటూనే రోడ్లు దాటుతూ ప్రమాదాలకు కారణాలవుతున్నారు. ఎన్ని ప్రమాదాలు జరిగినా.. జనాలు మాత్రం రోడ్డు వెంట నడిచేప్పుడు.. ముందు ఏమొస్తుంది.. వెనకనుంచి ఏమొస్తుంది అన్నది చూసుకోకుండా ఫోన్లలో మునిగిపోతుండటం గమనిస్తున్నాం. అలాంటి వారిని టార్గెట్ చేసుకుని.. హైదరాబాద్‌లో ఓ అంతర్జాతీయ ముఠా తమ దందాకు తెర తీసింది.

హైదరాబాద్‌లో మొబైల్ స్నాచింగ్‌కు పాల్పడుతున్న అంతర్జాతీయ ముఠాను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠాకు చెందిన ఐదుగురు సూడాన్‌ దేశస్థులతో సహా 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి ఏకంగా రూ.1.75 కోట్ల విలువైన 703 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను హైదరాబాద్‌ సీపీ కొత్తకోట శ్రీనివాస్‌ రెడ్డి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

నిందితుల్లో 12 మంది హైదరాబాద్‌కు చెందినవారని.. ఐదుగురు సూడాన్‌ వాసులు ఉన్నారని సీపీ వెల్లడించారు. రాత్రి సమయంలో రోడ్ల వెంట నడుచుకుంటూ వెళుతున్న వారినే ఈ స్నాచింగ్ ముఠా టార్గెట్ చేసుకుంటున్నారని తెలిపారు. కొన్ని సందర్భాల్లో వారిని మాటల్లో పెట్టి మొబైల్ స్నాచింగ్, నగదు చోరీ చేస్తున్నారని చెప్పారు. రాత్రి 10 గంటలు తర్వాత స్నాచింగ్స్ ఎక్కువగా జరుగుతున్నట్టు గుర్తించామన్నారు.

నగరంలోని 3 కమిషనరేట్ల పరిదిలో ఈ స్నాచింగ్ జరుగుతుందని.. చోరీకి గురైన, దెబ్బతిన్న సెల్‌ఫోన్లను అబిడ్స్‌లోని జగదీశ్‌ మార్కెట్‌లో విక్రయిస్తున్నారని తెలిపారు. దెబ్బతిన్న ఫోన్లను అక్కడే డిస్మెంట్‌ చేస్తున్నారన్నారు. ఓ వ్యక్తి జగదీశ్‌ మార్కెట్‌లో ఇలాంటి ఫోన్ల కోసం ప్రత్యేకంగా ఒక కౌంటర్‌ ఏర్పాటు చేశాడన్నారు. దొంగిలించిన సెల్‌ఫోన్లను సముద్ర మార్గం ద్వారా సూడాన్‌ తరలిస్తున్నారని.. విమానాశ్రయాల్లో అయితే నిఘా ఎక్కువగా ఉంటుందని, పడవల్లో వాటిని తీసుకెళ్తున్నారని వివరించారు.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T10:58:03Z dg43tfdfdgfd