చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌కు షాక్

బాపట్ల జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ఆమంచి కృష్ణ మోహన్‌కు షాక్ తగిలింది. ఎన్నికల అధికారులు ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్‌ను పెండింగ్‌లో పెట్టారు. ఆమంచి కృష్ణమోహన్ విద్యుత్ బకాయిలు చెల్లించలేదని.. ఓవ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆమంచి సుమారుగా 4.63 కోట్ల రూపాయల విద్యుత్ బకాయిలు చెల్లించలేదని నాగార్జునరెడ్డి అనే వ్యక్తి అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆమంచి కృష్ణమోహన్ నామినేషన్‌ను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పెండింగ్‌లో పెట్టారు. ఆమంచి కృష్ణమోహన్.. నామినేషన్ పత్రాల్లో కొన్ని పేపర్లు జతచేయలేదని.. అందుకే పెండింగ్ పెట్టినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. పత్రాలు అందజేస్తే నామినేషన్ ఆమోదిస్తామని తెలిపారు.

మరోవైపు మొన్నటి వరకూ అధికార వైసీపీలో కొనసాగిన ఆమంచి కృష్ణమోహన్ ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైసీపీలో చీరాల టికెట్ ఆశించిన ఆమంచికి మొండిచేయి ఎదురైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే కరణం బలరాం తనయుడు కరణం వెంకటేష్‌‌కు వైఎస్ జగన్ టికెట్ ఇచ్చారు. దీంతో ఆమంచి కృష్ణ మోహన్‌ వైసీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కాంగ్రెస్ నుంచి చీరాల ఎమ్మెల్యే స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. అయితే నామినేషన్ దాఖలు ప్రక్రియలో ఎదురైన ఈ అభ్యంతరాలపై ఆమంచి వర్గీయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు.. ఆమంచి కృష్ణమోహన్ 2009లో కాంగ్రెస్ పార్టీ తరుఫున చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014 ఎన్నికల్లో నవోదయం పార్టీ పెట్టి పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆ తర్వాత టీడీపీకి మద్దతిస్తూ ఆ పార్టీలో నవోదయం పార్టీని విలీనం చేశారు. ఇక 2019 ఎన్నికల నాటికి ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలో చేరారు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి చీరాల అభ్యర్థిగా పోటీ చేసి కరణం బలరాం చేతిలో ఓడిపోయారు. 2024 ఎన్నికల్లో మరోసారి చీరాల నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ వేశారు. మరి బరిలో నిలిచే అంశం ఏమౌతుందో చూడాలి మరి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-26T16:38:44Z dg43tfdfdgfd