టీడీపీకి ఆ నియోజకవర్గంలో బిగ్ రిలీఫ్.. అన్నదమ్ముల్ని కలిపిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి

నెల్లూరు జిల్లా కందుకూరు నియోజకవర్గం టీడీపీలో వర్గపోరుకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెక్ పెట్టారు. ఇంటూరి బ్రదర్స్ మధ్య సయోధ్య కుదిర్చారు. మంగళవారం కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు నామినేషన్ కార్యక్రమం కోసం కందుకూరు వచ్చిన వేమిరెడ్డి రంగంలోకి దిగారు.. నేతల్ని ఐక్యం చేశారు. చంద్రబాబునాయుడును మళ్లీ ముఖ్యమంత్రి చేసేందుకు కలిసి ముందుకు సాగాలన్నారు. ఇంటూరి బ్రదర్స్‌ చేతులు కలిపి.. మాజీ ఎమ్మెల్యే దివి శివరాంను ఒప్పించారు. సమష్టి కృషితో కందుకూరులో విజయం సాధించాలని ఆకాంక్షించారు.

టీడీపీ నేతలు ఏకతాటిపైకి వచ్చి ఒకే కుటుంబంలా ముందుకు సాగాలని.. కందుకూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నాగేశ్వరరావును గెలిపించాలని నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అన్నారు. కందుకూరులోని నియోజకవర్గంలో నేతలు నాగేశ్వరరావు, రాజేష్, దివి శివరాం ఒకే కుటుంబంలా ఉంటారన్నారు. కందుకూరుకు వచ్చిన వేమిరెడ్డి ఇంటూరి రాజేష్‌ కార్యాలయానికి వెళ్లి చర్చించారు. నాగేశ్వరరావుతో కలిసి పని చేయాలనీ, పార్టీ అధికారంలోకి వచ్చాక అధిష్ఠానం తగిన ప్రాధాన్యత ఇస్తుందని సర్దిచెప్పారు.

అనంతరం వేమిరెడ్డి, రాజేశ్‌లు కలిసి మాజీ ఎమ్మెల్యే దివి శివరాం నివాసానికి చేరుకుని చర్చలు జరిపారు. శివరాం కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరారు. మంగళవారం సాయంత్రం టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వేమిరెడ్డితోపాటు నాగేశ్వరరావు మాట్లాడారు. శివరాం మనసు నొప్పించి ఉంటే క్షమించాలని నాగేశ్వరారావు కోరారు. సమావేశం అనంతరం రాజేష్ కార్యాలయంలో ఇంటూరి సోదరులతో కరచాలనం చేయించారు. ఇద్దరు కలిసి పనిచేయాలని సూచించారు. దీంతో టీడీపీలో వర్గపోరుకు పుల్‌స్టాప్ పడిందని చెబుతున్నారు.

కందుకూరు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ పదవి కోసం మొదటి నుంచి ఇంటూరి బ్రదర్స్ (నాగేశ్వరరావు, రాజేష్) మధ్య వార్ నడిచింది. అయితే చంద్రబాబు నాగేశ్వరరావు వైపు మొగ్గు చూపారు.. ఆయన కూడా నియోజకవర్గంలో పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టారు. అయినా సరే ఇంటూరి బ్రదర్స్ మధ్య వార్ కొనసాగుతూనే వస్తోంది.. రాజేష్ కందుకూరు టికెట్ రేసులో తాను కూడా ఉన్నానని సంకేతాలు పంపారు. ఈ క్రమంలో లోకేష్ పాదయాత్ర సమయంలో రెండు వర్గాలు పోటా పోటీగా ఏర్పాట్లు చేశాయి. అయితే టీడీపీ అధిష్టానం ఇంటూరి నాగేశ్వరరావుకు కందుకూరు టికెట్ కేటాయించింది.

నాగేశ్వరరావుకు టికెట్ దక్కడంతో రాజేష్ రెబల్‌గా బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకున్నారు. నియోజకవర్గం పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు. ఇంతలో ఇంటూరి నాగేశ్వరరావుపై మాజీ ఎమ్మెల్యే దివి శివరాం కూడా భగ్గుమన్నారు.. నాగేశ్వరరావు తన కుటుంబాన్ని అవమాన పరిచారని శివరాం మండిపడ్డారు. తమ కుటుంబాన్ని దూషించిన నాగేశ్వరరావుకు మద్దతు ఇచ్చే సమస్యే లేదన్నారు. . రాజేష్ విజయానికి కృషి చేస్తామని తెలిపారు. రాజేష్, శివరాంలు కలిసి నియోజకవవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు. ఈ క్రమంలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రంగంలోకి దిగారు.. నేతలు కలిసి పనిచేయాలని సూచించారు. మరి ముగ్గురు నేతలు ఏకతాటిపైకి వస్తారా.. ఎడ మొహం పెడ మొహంగా ఉంటారా అన్నది చూడాలి.

ఇటువంటి మరిన్ని వార్తలు సమయం తెలుగులో చదవండి. లేటెస్ట్ వార్తలు, సిటీ వార్తలు, జాతీయ వార్తలు, బిజినెస్ వార్తలు, క్రీడా వార్తలు, రాశిఫలాలు ఇంకా లైఫ్‌స్టైల్ అప్‌డేట్లు మొదలగునవి తెలుసుకోండి. వీడియోలను TimesXP లో చూడండి.

2024-04-24T06:44:11Z dg43tfdfdgfd