ఇంద్రవెల్లి ఘటనకు 43 ఏళ్లు…

జల్.. జమీన్… జంగిల్ నినాదంతో ఆదివాసి గిరిజనుల హక్కుల కోసం అడవి బిడ్డలు చేసిన పోరాటంపై కురిసిన తుపాకీ గుండ్ల వర్షం కురిసింది. ఈ పోరాటంలో 13 మంది అమరులయ్యారు. ఇది నెత్తుటి గాయన్ని మిగిల్చింది. 43 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన ఆదివాసి గిరిజనుల గుండెల్లో మాత్రం అది మానని గాయంగానే మిగిలిపోయింది. మరోవైపు ఈ ఘటనకు నిదర్శనంగా నిలుస్తున్నఇంద్రవెల్లిలోని నిలువెత్తు స్మారక స్థూపం ఆ దారి వెంట వచ్చి పోయే వారికి నాడు జరిగిన సంఘటనలో అమరత్వం పొందిన ఆదివాసీ గిరిజన వీరుల త్యాగాలను గుర్తుచేస్తూనే ఉంది.

అసలు ఆ రోజు జరిగింది ఏమిటి. ఎందుకు 13 మంది అమరులయ్యారు. తెలియాలంటే ఇది పూర్తిగా చదవండి. ఆదివాసి గిరిజనులు చట్టబద్దమైన హక్కుల కోసం రైతు కూలి సంఘం ఆధ్వర్యంలో గిరిజనులు పోరుబాట పట్టారు. దౌర్జన్యాలను ఎదిరించడం మొదలు పెట్టారు. భూ సమస్య పరిష్కారం కోసం తుడుం మోగించి పోరును మరింత ఉధృతం చేశారు. ఇందులో భాగంగా ఇంద్రవెల్లిలో 1981 ఏప్రిల్ 20వ తేదిన బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఆ రోజు సోమవారం వార సంత కూడా కావడం, మరో వైపు బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో భారీ సంఖ్యలో ఆదివాసి గిరిజనులు తరలివచ్చారు.

రాష్ట్రస్థాయి ఇండియన్ టాలెంట్ ఒలింపియాడ్‌లో పారమిత విద్యార్థుల ప్రతిభ

తొలుత సభకు అనుమతినిచ్చినా ఆ తర్వాత ఈ సభకు అనుమతి లేదని భారీగా పోలీసులను మోహరించారు. సభను అడ్డుకునే ప్రయత్నం కూడా జరిగింది. 144 సెక్షన్ విధించారు. అయినా ఇంద్రవెల్లి జనసంద్రంగా మారింది. పోలీసులు తుపాకులు ఎక్కుపెట్టి జనాలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో మాటామాటా పెరిగి పరిస్థితి కాల్పులకు దారితీసింది. అప్పటి ఆర్డిఓ ఆదేశాల మేరకు కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో 13 మంది చనిపోయినట్లు ప్రభుత్వ రికార్డుల్లో ఉంది. అయితే అంతకన్నా ఎక్కువమందే మరణించారని పౌర హక్కుల సంఘాలు పేర్కొన్నాయి. చాలా మంది గాయాలతో బయటపడ్డారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20వ తేదిన ఇంద్రవెల్లి అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్నిజరుపుతూ వస్తున్నారు.

ఓటు హక్కు కోసం ఇసుకకు ప్రాణం పోసిన బాలికలు!

అయితే ఈ కాల్పుల ఘటనలో మృతిచెందిన ఆదివాసుల స్మారకార్ధం రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో 80 అడుగుల స్థూపాన్ని నిర్మించారు. కానీ ఆ స్థూపాన్ని 1986లో కొందరు గుర్తుతెలియని వ్యక్తులు పేల్చివేశారు. దీంతో ఆదివాసులు చేపట్టిన ఆందోళనల ఫలితంగా మరోసారి 1987లో స్థూపాన్ని నిర్మించారు. ఇక్కడే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 20న అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. అయితే ఏప్రిల్ 20 ఆ ప్రాంతంలో 144 విధించడంతోపాటు పలు ఆంక్షలు విధించేవారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కొంత ఆంక్షలను సడలించడంతో గిరిజన సంఘాలు, ప్రతినిధులు, ఆదివాసి గిరిజనులు ఇంద్రవెల్లి స్థూపం వద్దకు వచ్చి మృతవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. జిల్లాకు వస్తున్న ప్రముఖులు, ప్రజాప్రతినిధులు కూడా ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్నిన్ని సందర్శించి వెళుతున్నారు.

ఇదిలా ఉంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్ది బాధ్యతలను చేపట్టిన తర్వాత ఇంద్రవెల్లి ఘటనలో అమరులైన వారి కుటుంబాలకు కొంత ఓదార్పు నిచ్చారు. పోలీసుల రికార్డు ప్రకారం 15 మంది అమరవీరుల కుటుంబాలకు ఇంటి స్థలాలను కేటాయించారు. ఐదు లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్లను కూడా మంజూరు చేశారు. వీరికి ఐటిడిఏ ద్వారా రుణాల చెల్లింపునకు హామీ కూడా ఇచ్చారు. అలాగే ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపాన్ని స్మృతి వనంగా తీర్చిదిద్దేందుకు 97 లక్షల రూపాయలను కూడా కెటాయించి పనులను ప్రారంభించారు. అయితే ఈ ఘటనలో అమరులైన మిగతా గిరిజన వీరులను కూడా గుర్తించి వారి కుటుంబాలకు చేయూతనివ్వాలని ఆదివాసి గిరిజనులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

2024-04-24T01:57:05Z dg43tfdfdgfd