దళిత్ హిస్టరీ మంత్: కులవ్యవస్థపై పూర్వీకులు చేసిన పోరాటాలు, వారు చేసిన త్యాగాల గురించి మనకేం తెలుసు?

ఏప్రిల్‌ నెలను 'దళిత హిస్టరీ మాసం'గా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఈ నెలలో దళితులను గుర్తుచేసుకుంటారు. ఈ వేడుక పోరాటాలకు, జ్ఞాపకాలకు ప్రతీక.

ఈ నెల సంఘీభావానికి సజీవ ఉదాహరణగా నిలుస్తుంది. ఏడాది పొడవునా ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న దళితులకు స్ఫూర్తినిస్తుంది.

కేవలం బాబా సాహెబ్ మాత్రమే ఏప్రిల్ నెలలో జన్మించలేదు. కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడిన ఎందరో ఈ నెలలోనే జన్మించారు.

వీరిలో బాబు జగ్జీవన్ రామ్, మహాత్మా జ్యోతిబా ఫూలే కూడా ఉన్నారు. భారత స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఝల్కారీ బాయి అశువులు బాసింది కూడా ఏప్రిల్‌లోనే.

పూర్వీకుల గొప్ప వారసత్వాన్ని గుర్తుచేసుకోవడానికి ఏప్రిల్ నెల ఒక అవకాశాన్ని అందిస్తుంది.

దళిత సమాజాన్ని ఎప్పుడూ అణచివేసే కుల వ్యవస్థకు వ్యతిరేకంగా పూర్వీకులు చేసిన పోరాటాలు, వారు చేసిన త్యాగాలు మనకు ఎంత వరకు తెలుసు?

1757లో ప్లాసీ యుద్ధం జరిగింది, ఇందులో మొఘల్ చక్రవర్తితో దుసాధులు పోరాడారు, ఆయనను ఓడించారు.

1857 తిరుగుబాటు లేదా ఝల్కారీ బాయి నుంచి మంగూ రామ్, ఉదా దేవి వరకు...ఇలాంటి వ్యక్తుల గురించి మీకు ఏమాత్రం తెలుసు?

స్వాతంత్య్రం కోసం పోరాడటం నుంచి దేశ నిర్మాణం వరకు వారి పాత్రలు విస్మరించారు, లేదా చింపేసిన చరిత్ర పేజీల్లో అటువంటి కథలు ఉండొచ్చు.

దళితులు ప్రతిరోజూ పోరాటం చేస్తూనే ఉంటారు. నీటి కోసం, అంటరానితనాన్ని వదిలించుకోవడం కోసం, కష్టానికి తగిన గౌరవం కోసం, దేవాలయాల్లోకి ప్రవేశించడం కోసం ఈ పోరాటాలు జరుగుతున్నాయి.

ఆలోచనల్లో మార్పులు

నేడు కులం మన రోజువారీ సంభాషణల్లో భాగమైంది. కులం గురించి మన చుట్టూ జరుగుతున్న చర్చల కారణంగా, కుల ఆధారిత స్పృహ, దాని పట్ల సున్నితత్వం పెరిగింది.

సినిమా పాత్రల్లో కూడా మార్పులు కనిపిస్తున్నాయి. లగాన్‌లో 'కచ్రా' తరహా పాత్రను చూపించగా, నేడు దళిత పాత్రలు పోరాట పటిమ, తెలివితేటలు, సమర్ధత కలిగిన వ్యక్తులుగా ప్రెజెంట్ అవుతున్నాయి.

'జై భీమ్‌', 'కాంతారా' వంటి చిత్రాలు ఈ మార్పునకు ఉదాహరణలు.

నేను అగ్రవర్ణ-సంపన్న తరగతికి చెందిన వ్యక్తులను కలుస్తుంటాను, వారు కులతత్వం ఒక ప్రధాన సామాజిక సమస్య కాదంటారు, వారి దృష్టిలో కుల ఆధారిత వివక్ష ముగిసింది.

కానీ, పెళ్లి మాట రాగానే మాత్రం తమ కులానికి చెందిన భాగస్వామి కోసం వెతుకులాట మొదలుపెడతారు.

ఇంగ్లీషు వార్తాపత్రికల్లో మ్యాట్రిమోనియల్ ప్రకటనల కాలమ్‌లు కులం ప్రాతిపదికన విభజించారు. జనాలు తమ సొంత కులంలోని వధూవరుల కోసం చూస్తుంటారు, కులం ఆధారంగా వివక్ష చూపడం లేదని చెప్పే వారంతా ఈ కోవకు చెందినవారే.

కులం ఆధారంగా వివక్షను ఎదుర్కోరని, వారి కుటుంబంలో ఎవ్వరూ కులతత్వంతో ప్రవర్తించడం చూడలేదని కొందరు చెప్పడం నన్ను ఆశ్చర్యపరుస్తుంది.

అపోహలు సృష్టించే ప్రయత్నం

కులం, దాని చారిత్రక పునాది గురించి కూడా కొత్త కథలు వస్తున్నాయి. కులాన్ని నిర్వచించడానికి మత గ్రంథాలను వదలడం లేదు, కులం చరిత్రనూ అన్వేషిస్తున్నారు.

వర్ణం, కులాల మధ్య వ్యత్యాసాన్ని వివరించడానికి చాలా పుస్తకాలు వచ్చాయి. 'వాట్సాప్ యూనివర్శిటీ' మొత్తం 'కులం' అనే పదం అవగాహనకు సంబంధించిన వింత సమాచారంతో నిండి ఉంది.

సహజంగానే కాస్ట్ అనే ఆంగ్ల పదం పోర్చుగీస్ పదం 'కాస్టస్' నుంచి ఉద్భవించింది.

ఈ కులం అనేది పాశ్చాత్య భావన అని, అది బ్రిటిష్ వారు సామ్రాజ్యవాదం విషయంలో ఉపయోగించారని కొందరు ఒక వాదనను తెరపైకి తెచ్చారు.

నేను ఈ పదం మూలం గురించి ప్రశ్నించడం లేదు, అదే సమయంలో విదేశీయులు కులాన్ని దుర్వినియోగం చేశారనే వాదననూ తిరస్కరించడం లేదు.

దళితుల ప్రస్తుత పరిస్థితి నన్ను చాలా బాధ పెడుతోంది. ఈరోజు బలాన్ని ప్రయోగించి దళితులపై అత్యాచారాలు చేస్తున్నదెవరు? నేటి సమాజంలో మేం ఎక్కడున్నాం?

మేం మా చారిత్రక పాత్రను తిరిగి పొందాలనుకుంటున్నాం, తద్వారా భవిష్యత్తులో గౌరవప్రదంగా జీవించగలం.

దేశంలో కుల వివక్ష లేదని చాలామంది భావిస్తారు. వారి పెద్దలు దళితులతో మంచిగా ప్రవర్తించడాన్ని చూశామనీ చెబుతుంటారు.

అయితే, నీరు వంటి ప్రాథమిక అవసరాల కోసం నా కులం శతాబ్దాల పాటు సాగించిన పోరాటం నాకు బాగా గుర్తుంది.

దేశంలో కుల దురభిమానం ఇకపై ఉండదనే వాదనలు వినీ వినీ నాకు విసుగొచ్చింది.

కులతత్వం లేదని, తాను చూడలేదని ఎవరైనా చెబితే, ఆ వ్యక్తి అగ్రవర్ణం గురించే మాట్లాడుతున్నారని అనుకోవాలి. బహుశా ఆ వ్యక్తి సంపన్న కుటుంబంలో పుట్టి ఉండాలి.

వారికేం ఏం తెలుసు?

కులం పేరుతో అణచివేతకు గురికాని వ్యక్తి మన తరతరాల బాధను ఎలా అర్థం చేసుకోగలరు అనే ప్రశ్న నాలో నాకు తరచూ వినిపిస్తుంటుంది.

దళితులు కులతత్వం వల్ల ఎలాంటి బాధను అనుభవించలేదని వాళ్లు ఎలా చెప్పగలుగుతున్నారు? కష్టాలు, దోపిడీకి గురైన వారు తమ కష్టాలు తీరిపోయాయని స్వయంగా ప్రకటించాలి కదా. అలాంటిది ఎక్కడైనా వినిపించిందా?

ఎవరైనా కుల వివక్షను ఎదుర్కోకపోతే అది వాళ్ల అదృష్టమే తప్ప దాని అర్ధం కులతత్వం పోయిందని కాదు. కొన్ని సామాజిక వాస్తవాల విషయంలో కొందరి అజ్ఞానం చూస్తే బాధ కలుగుతుంది.

నేను కులతత్వం గురించి విన్నప్పుడు, ముఖ్యంగా ఒక దళిత మహిళగా నా అనుభవాలను పంచుకున్నప్పుడు, కొందరి ముఖాల్లో కనిపించే ఆశ్చర్యం వారి అజ్ఞానానికి నిదర్శనంగా కనిపిస్తుంది.

వారి అజ్ఞానం మన పోరాటాన్ని దూరం చేస్తుంది. మా అనుభవాలు చెప్పినప్పుడు, రిజర్వేషన్ కోసం ఇవన్నీ చెబుతున్నామనుకుంటారు.

రిజర్వేషన్ అనేది దానం కాదు, గత అకృత్యాలకు ప్రాయశ్చిత్తమూ కాదు. బాబాసాహెబ్ పోరాడిన సమానత్వం వైపు వెళ్లడం మా హక్కు, దానికోసం ఇంకా మేం పోరాడుతున్నాం.

ఆ చావులకు కారకులెవరు?

విదేశీ శక్తులు మన దేశాన్ని విడిచి వెళ్లిపోయాయి. మన దేశంలో కుల వ్యవస్థ ఉందని, లేదా కులతత్వంతో ప్రవర్తిస్తారనడాన్ని చాలామంది ఒప్పుకోరు.

మరి దళిత బాలికలపై అత్యాచారం చేసి సజీవ దహనం చేస్తున్నదెవరు?.

మురుగు కాల్వలు శుభ్రం చేస్తూ దళితులు ఎందుకు చనిపోతున్నారు? గుర్రం ఎక్కినందుకు ఎందుకు చంపుతున్నారు? నేటికీ దళితుడి శరీరాన్ని బల ప్రదర్శన కోసం ఎందుకు ఉపయోగించుకుంటున్నారు? ఈ అణచివేతకు పాల్పడుతున్నది ఎవరు?

ఇలాంటి మాటల ద్వారా నన్ను నేను బాధితురాలిగా చూపించుకోవడానికి ప్రయత్నించడం లేదు. కానీ, ఇవన్నీ ఎవరు చేస్తున్నారు?

దళిత నాయకులకు అధికార దాహం ఉందనే మాట తరచూ వినిపిస్తుంటుంది.

కచ్చితంగా మేం అధికారంలో ఉండాలనుకుంటున్నాం. శతాబ్దాలుగా మమ్మల్ని ప్రభుత్వాల చివరలకు నెట్టేశారు. ఇప్పుడు మేం అధికారాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నాం.

మేం అటువంటి నెట్‌వర్క్‌ని, వాతావరణాన్ని సృష్టించాలనుకుంటున్నాం. అమెజాన్‌లో పని చేస్తున్నవాళ్లు, సియాటిల్‌లో ఉండే వాళ్లు కూడా మాకు తెలుసు. వాళ్లకు మా రెజ్యూమ్‌ని ఫార్వార్డ్ చేయగలం.

కేంబ్రిడ్జ్‌లో ఉండే వారితో కూడా మా పరిచయాన్ని పెంచుకోవాలనుకుంటున్నాం, తద్వారా వారు మా కెరీర్‌లో ముందుకు సాగడానికి మాకు సహాయపడగలరు. వీటన్నింటికీ మేం దూరమయ్యాం. ఇప్పుడు మాకు ఇవన్నీ కావాలి. మా హక్కులను బలంగా నొక్కి చెప్పాలనుకుంటున్నాం.

దళితుల చరిత్ర మాసంలో మనమంతా కులవాదులమని ఒప్పుకుందాం. మనమందరం ఏదో ఒక విధంగా జాత్యహంకారంగా ప్రవర్తిస్తాం.

కులం మన ఆలోచనల్లో లోతుగా పాతుకుపోయింది. ఈ వాస్తవాన్ని మనం అంగీకరించలేకపోతే, బాబాసాహెబ్ పేరుతో సోషల్ మీడియాలో పోస్టులు రాయడం అర్థరహితం.

ముందుగా కులం ఉందని అంగీకరించాలి. మనం దీన్ని అంగీకరించాలి, దాని పట్ల సున్నితంగా ఉండాలి. అప్పుడే కుల ఆంక్షల నుంచి విముక్తి పొందాలనే చర్చను ప్రారంభించగలం.

ఇవి కూడా చదవండి:

బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)

సంబంధిత కథనాలు

2024-04-26T08:29:59Z dg43tfdfdgfd